
దేశంలోకి చైనా వైరస్ ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం లాక్డౌన్ విధించిన సంగతి తెల్సిందే. లాక్డౌన్ కారణంగా గత రెండున్నర నెలలుగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పేద, మధ్యతరగతి, వలస కార్మికుల ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. లాక్డౌన్ కారణంగా ఎంతోమంది నిరుద్యోగులుగా మారారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలను ఆదుకుంటున్నామని గొప్పలు చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం ఎక్కడ కన్పించడం లేదు. కేంద్రం ప్రకటించిన 20లక్షల కోట్ల ప్యాకేజీతో పేద ప్రజలకు ఒరిగేందేమీలేదనే అభిప్రాయాన్ని మెజార్టీ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. అయితే లాక్డౌన్ కారణంగా ఆయిల్ కంపెనీలు నష్టాలను చూపుతూ పెట్రో, డీజిల్ ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. జూన్లో లీటర్ పెట్రోల్ ధర రూ.5కు పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
లాక్డౌన్ కారణంగా జీతాల్లేకుండా ఇబ్బందులు పడుతున్నవారికి ఇది నిజంగా బ్యాడ్ న్యూసే.. ఆయిల్ కంపెనీలు పెట్రోల్ ధరలను పెంచితే అదంతా ట్రాన్స్ పోర్టు రంగంపై ప్రభావం చూపుతోంది. దీనివల్ల నిత్యావసర సరకులు ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ట్రాన్స్ పోర్టు రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారికి మరింత భారమయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మే 31 తర్వాత లాక్డౌన్ ఎత్తేసినా.. లేదా కొనసాగించినప్పటికీ ఆయిల్ కంపెనీలు రోజువారీగా ధరలను సమీక్షించనున్నాయి. గడిచిన వారం క్రితమే ఇంధన కంపెనీలు ధరల పెంపుపై చర్చించినట్లు సమాచారం. ప్రభుత్వం కూడా పెట్రోల్, డిజీల్ ధరలు పెంపునకు అనుమతి ఇస్తుందనే అభిప్రాయాన్ని ఆయిల్ కంపెనీలు వ్యక్తం చేస్తున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరల్లో పెద్దగా మార్పులేకపోవడంతో రానున్న రెండు వారాల్లో రోజుకు 50పైసలు చొప్పున పెంచుకుంటూ పోతూ నష్టాలను తగ్గించుకునేందుకు ఆయిల్ కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ పెంపుకు కేంద్రం కూడా సానుకూలంగా ఉండటంతో వాహనదారులకు పెట్రో మంట తప్పేలా కన్పించడం లేదు. ఓ వైపు జనం డబ్బుల్లేక అల్లాడుతుంటే కేంద్రం ఆయిల్ కంపెనీలకు వత్తాసు పలుకడం చూస్తుంటే ‘ములిగే నక్కపై తాడిపండుపడ్డ చందంగా సామన్యుడి పరిస్థితి’ మారిందని పలువురు వాపోతున్నారు.