తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ గురుకులాల కార్యదర్శి, ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తన ఉద్యోగానికి రాజీనామా చేయడం రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. గతంలో గురుకులాల్లో చదువు అంటే.. సర్కారు బడికి సెకండ్ వెర్షన్ గా భావించే పరిస్థితి నుంచి.. గురుకులాల్లోనే చదవాలని పిల్లలు, తల్లిదండ్రులు కోరుకునే పరిస్థితిని తేవడంలో ప్రవీణ్ కుమార్ పాత్ర అమోఘమైనది. ఇంకా ఆరేళ్ల సర్వీసు ఉన్న ఆయన.. అర్ధంతరంగా ఉద్యోగాన్ని వదిలేయడానికి గల కారణాలు ఏంటన్నది చాలా మందికి అర్థం కాలేదు. అయితే.. తాజా పరిణామం ఒకటి సరికొత్త చర్చకు దారితీస్తోంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా దీన్నిప్రారంభించబోతున్నారు. అయితే.. ఈ పథకం అమలు తీరుపై చర్చించేందుకు ఈ నెల 26న సీఎం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రగతి భవన్‌లో జరగనున్న ఈ సమావేశంలో.. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన వారితోపాటు దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు.
మొత్తం 412 మంది ఈ చర్చలో పాల్గొనబోతున్నారు. ఇప్పటికే అందరికీ ఆహ్వానాలు కూడా అందాయి. అయితే.. ఈ జాబితాలో ప్రవీణ్ కుమార్ పేరు లేదట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. దళిత బంధు చర్చలకు తనకు ఆహ్వానం లేదు అని తెలిపారు. దీంతో.. కేసీఆర్ – ప్రవీణ్ కుమార్ మధ్య గట్టిగానే విభేదాలు వచ్చాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు.. ఆయన రాజీనామా చేయడానికి ఇదే కారణం కావొచ్చా? అనే చర్చ కూడా సాగుతోంది.
తన ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత రాజకీయాలపై ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో బహుజనులకు న్యాయం జరగలేదన్న ఆయన.. సంపద మొత్తం ఒక్క శాతం మంది వద్దనే కేంద్రీకృతమైందని అన్నారు. మిగిలిన 99 శాతం మందికి తాయిలాలు వేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ‘దళిత బంధు’ చర్చలకు ప్రవీణ్ కుమార్ ను పిలవకపోడంతో వివాదం పెద్దదే అనే చర్చ సాగుతోంది. మరి, 26వ తేదీ చర్చ తర్వాత.. ప్రవీణ్ కుమార్ ఈ పథకంపై ఎలాంటి కామెంట్లు చేస్తారన్నది చూడాలి.