
మెగాస్టార్ చిరంజీవి ఎన్నో ఆశలు, ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చారు. ఉమ్మడి ఏపీకి సీఎం కావడమే లక్ష్యంగా పనిచేశారు. ‘ప్రజారాజ్యం’ స్థాపించి 2009 ఎన్నికల్లో పోటీచేశారు. తెలుగు తెరపై తిరుగులేని స్టార్ డం ఉన్న చిరంజీవిని ప్రజలు తిరస్కరించారు. కేవలం 18 సీట్లు మాత్రమే ఇచ్చి ఓడగొట్టారు. నాడు కాంగ్రెస్ కే పట్టం కట్టారు. వైఎస్ఆర్ ను సీఎంగా రెండోసారి గెలిపించారు.
అయితే చిరంజీవి తెలుగు రాజకీయాల్లో ఎన్నో కుట్రలు, కుతంత్రాలకు బలై చివరకు రాజకీయాల నుంచే ఎగ్జిట్ అయ్యారు. ఇక ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ వచ్చాడు. ఆయన కూడా రాజకీయాల్లో ఫెయిల్ అయిపోయారు.
వీరిద్దరి నుంచి పాఠాలు నేర్చుకొని బరిలోకి దిగారు కమల్ హాసన్. ‘మక్కల్ నీది మయ్యం’ పార్టీని స్తాపించి పోయిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేశారు. ఒక్క సీటు గెలవలేదు. ఇప్పుడు ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి కట్టి బరిలోకి దిగారు. ఆయన పార్టీ.. చివరకు కమల్ హాసన్ కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు.
ఘోర ఓటమి తో కమల్ పార్టీ నుంచి నాయకులందరూ వెళ్లిపోయారు. చివరకు కమల్ కూడా రాజకీయాలు వదిలేసి సినిమాల బాట పడుతారని వార్తలు వచ్చాయి. కానీ కమల్ మాత్రం తాను రాజకీయాలు వదిలేసేది లేదని తేల్చిచెప్పారు. పార్టీ నుంచి ఎంత మంది బయటకు వెళ్లినా తాను మాత్రం రాజకీయ పయనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వీడేది లేదని స్పష్టం చేశారు. ప్రాణం ఉన్నంత వరకు రాజకీయాల్లో కొనసాగుతానని కమల్ తేల్చిచెప్పాడు. తాజాగా కమల్ హాసన్ ట్వీట్ చేశాడు.
చిరంజీవి, పవన్, కమల్ ఇలా ఎంతో మంది నటులను సినిమాల్లో ఆదరిస్తున్న ప్రజలు రాజకీయాల్లోకి వచ్చేసరికి మాత్రం కాలదన్నుతున్నారు. తారలు రాజకీయాల్లో ఎదగడం ఈ వర్ధమాన రాజకీయాల్లో కష్టమే అనిపిస్తోంది.