చైనా కుయుక్తులు పన్నుతోంది. భారత్ తో కయ్యమే ప్రధానంగా సాగే చైనా తన వక్రబుద్ధిని ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తూనే ఉంటుంది. సరిహద్దు విషయంలో నిరంతరం భారత్ తో వైరమే పెట్టుకుంటోంది. తన ప్రాబల్యం నిరూపించుకునేందుకు ఎన్ని అడ్డదారులైనా తొక్కేందుకు వెనుకాడదు. భారత్ ఎంతకీ దిగిరాకపోవడంతో సరిహద్దు ప్రాంతాలను టార్గెట్ చేస్తూ తన పని సులువు చేసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా టిబెట్ లో వేగంగా మార్పులు చేసే దిశగా అడుగులు వేస్తోంది. వారిలో అసంతృప్తిని చల్లార్చే క్రమంలో వ్యూహాత్మకంగా ప్రవర్తిస్తోంది. తాజాగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తొలిసారి టిబెట్ ను సందర్శించారు. అధ్యక్షుడి హోదాలో ఇంతవరకు జిన్ పింగ్ ఇక్కడ పర్యటించలేదు.
జిన్ పింగ్ పర్యటనను చైనా రహస్యంగా ఉంచింది. ఆయన బుధవారం టిబెట్ లో పర్యటిస్తే శుక్రవారం ప్రసారం చేసింది. గురువారం లాసాలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఇంటర్నేషనల్ క్యాంపైన్ ఫర్ టిబెట్ సంస్థ తెలిపింది. గురువారం జిన్ పింగ్ అక్కడి సిచువాన్ టిబెట్ రైల్వేస్టేషన్, సిటీ మ్యూజియం సందర్శించి అధికారులతో మాట్లాడారు. టిబెట్ లో తన సంస్కృతిని ప్రవేశపెట్టేందుకు చైనా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా 2011లో టిబెట్లో అల్లర్లు చెలరేగాయి. దీంతో అక్కడ ఎలాంటి గొడవలు లేకుండా చేస్తున్నామని చెప్పుకుంటూ వారిని తమ చెప్పుచేతల్లోకి తీసుకునే కుట్రలు చైనా చేస్తోంది.
టిబెట్ వాసుల మాతృభాషను కూడా రూపుమాపేందుకు చైనా భావిస్తోంది. 2002లో టిబెట్ మాతృభాషతో పాటు మాండరీన్ నేర్చుకోవాలని ఆంక్షలు విధించింది. మెల్లగా టిబెట్ లో మాతృభాషను పక్కన పెట్టి మాండరీన్ కు ప్రాధాన్యం ఇస్తున్నట్లు గత ఏడాది హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ వెల్లడించింది. ఒక తరగతిలో టిబెట్ భాషలో బోధించి మిగతా తరగతులను మాండరీన్ భాషలోనే చెబుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఉద్యమించిన ఒక వ్యక్తికి చైనా ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.
టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా (85) వారసుడి ఎంపికలో కూడా చైనా ప్రమేయం ఉండాలని భావిస్తోంది. ఆయన తదుపరి వారసుడి ఎంపిక కోసం ఎవరో ఒకరిని గుర్తిస్తే ఊరుకోమని హెచ్చరిస్తోంది. దీంతో ఆ కార్యక్రమం వాయిదా పడుతోంది. దలైలామా ఎంపికలో కీలకమైన పంచయిన్ లామాను చైనా తన చెప్పు చేతల్లో పెట్టుకుంది. పంచయిన్ లామా అంటే దలైలామాకు ముందు ఉండే పదవి. టిబెట్ బౌద్దుల్లో రెండో అత్యున్నత స్థానం. చైనా దుర్బిద్దిని పసిగట్టిన దలైలామా తన వారసుడు కేవలం టిబెట్ నుంచే రావాల్సిన అవసరం లేదన్నారు. ఉత్తర భారత్, నేపాల్, భూటాన్ ల నుంచి కూడా రావచ్చని ప్రకటించారు. దీనికి అమెరికా కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది.