
చైనా కుయుక్తులు పన్నుతోంది. డ్రాగన్ కుట్రలతో సరిహద్దులకు బలగాలను చేరవేస్తోంది. త్వరగా ప్రాంతాలు చేరుకునేందుకు రైలు మార్గాలు వేస్తోంది. ఈ దిశగా కార్యాచరణ వేగవంతం చేసింది. దీంతో అరుణాచల్ ప్రదేశ్ కు అతి సమీపంగా ఉన్న టిబెట్ సరిహద్దు ప్రాంతానికి బుల్లెట్ రైలు సేవలు ప్రారంభించింది. వేగంగా వాస్తవాధీన రేఖ వద్దకు చేర్చే అవకాశం కల్పించుకుంటోంది.
టిబెట్ రాజధాని లాసా నుంచి నింగ్ చి ప్రాంతం వరకు ఎలక్ర్టిఫైడ్ బుల్లెట్ రైలు సేవలను డ్రాగన్ శుక్రవారం ప్రారంభించింది. ఈ బుల్లెట్ రైలు కోసం లాసా, నింగ్ చి మధ్య 435.5 కిలోమీటర్ల పొడవైన హైస్పీడ్ రైల్వే ట్రాక్ నిర్మాణ పనులను 2014లోనే చైనా ప్రారంభించింది. టిబెట్ లో పూర్తిస్థాయిలో విద్యుదీకరించిన మొట్టమొదటి రైల్వే లైన్ ఇదే. టిబెట్ ప్రాంతంలో చైనా ప్రారంభించిన రెండో రైల్వే లైన్ ఇది.
ఈ బుల్లెట్ రైలుతో సిచువాన్ ప్లవిన్స్ రాజధాని చెంగ్దు నుంచి లాసా మధ్య ప్రయాణ దూరం 48 గంటల నుంచి 13 గంటలకు తగ్గనుందని డ్రాగన్ చెబుతోంది. ఈ ప్రాజెక్టుపై చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ గతేడాది నవంబర్ లో మాట్లాడుతూ సరిహద్దు స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి ఈ రైల్వే లైన్ సహాయపడుతునందని చెప్పడం కొసమెరుపు.
భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దును ఈ సింగిల్ నగరం అత్యంత సమీపంలో ఉంది. ఈ ప్రాంతం వరకు చైనా బుల్లెట్ రైలును తీసుకురావడం గమనార్హం. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ దక్షిణ టిబెట్ లోని భాగమని చైనా వితండవాదం చేస్తోంది. దీన్ని భారత్ ఎప్పటకపుడు ఖండిస్తోంది. డ్రాగన్ సరిహద్దు గ్రామాల అభివృద్ధి పేరుతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా బుల్లెట్ రైలు సేవలు తీసుకొచ్చింది.