
భారత వెబ్ సైట్లపై చైనా కన్ను వేసింది. వాటిని హ్యాకింగ్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈనెల రెండోవారంలో పశ్చిమబెంగాల్ లోని మాల్టా సమీపంలోని బంగ్లాదేశ్ సరిహద్దులో అరెస్టయిన గూఢచారి హాన్ జున్వేను ప్రశ్నించే కొద్దీ ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. దాదాపు పదేళ్లుగా అతడు భారత్ లో ఏం చేశాడనే దానిపై ఇప్పుడు ఆందోళనలు మొదలయ్యాయి. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందం పలు విషయాలు తెలుసుకుంది. చైనాలోని వివిధ ఏజెన్సీలు భారత రక్షణ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన వెబ్ సైట్లపై కన్నేసినట్లు గుర్తించారు.
బెంగుళూరులో బీఎస్ఎన్ఎల్ తో కలిసి ఒక కంపెనీ కూడా వీరి లక్ష్యంలో ఉందని, దీంతోపాటు వైమానిక రంగంలోని కంపెనీలను చైనా ఏజెన్సీలు లక్ష్యంగా చేసుకున్నట్లు గుర్తించారు. భారత రక్షణ వ్యవస్థలో ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు చైనా ప్రయత్నిస్తోంది. రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన వెబ్ సైట్లను లక్ష్యంగా చేసుకుందని తెలుస్తోంది. అతడు భారత్ లో ఎక్కడకు వెళ్తున్నాడన్న అంశం తెలియాల్సి ఉంది. ఇక్కడి నుంచి కూడా అతడికి ఎవరో గైడ్ చేస్తుండాలి.
హాన్ జున్వే ఫోన్, ల్యాప్ టాప్ లకు మాండరీన్ భాషలో పాస్ వర్డ్ లు ఇచ్చినట్లు తెలిసింది. దీంతో వీటిని ఓపెన్ చేయడం అధికారులకు తెలియడం లేదు. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఎస్జీలకు వీటిని క్రాక్ చేసే సామర్థ్యం ఉందని గుర్తించారు. అతడిని అరెస్టు చేసిన సమయంలో ఎలక్ర్టానిక్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఒక యాపిల్ ల్యాప్ టాప్ రెండు ఐఫోన్లు రెండు చైనా సిమ్ కార్డులు ఒక బంగ్లాదేశ్ సిమ్, ఒక భారత్ సిమ్ రెండు పెన్ డ్రైవ్ లు రెండు చిన్న టార్చిలైట్లు, ఐదు నగదు లావాదేవీలు చేసే యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
హాన్ వాలకం చూస్తుంటే అతడు సుశిక్షితుడైన గూఢచారిగానే భావిస్తున్నారు. అతడి వద్ద ఉన్న పరికరాలు చూస్తుంటే గూఢచర్యం తెలుస్తోంది. హాన్ గతంలో చాలాసార్లు భారత్ వచ్చినట్లు తెలిసింది. 2010లో అతడు హైదరాబాద్ వచ్చినట్లు గుర్తించారు. అతడి పాస్ పోర్టు పై బంగ్లాదేశ్ స్టాంప్ తప్పితే మరేమి లేదు. భారత్ లో తాను చెప్పే వాటిని నిరూపించుకోవడానికి అవసరమైన పత్రాలను కూడా సమకూర్చుకున్నాడు.