
దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు బలంగా ఉంది. ఆ పార్టీని ఢీకొట్టే ప్రతిపక్షం కాంగ్రెస్ కునారిల్లిపోయింది. అస్సలు కనుచూపు మేరలో బీజేపీకి ప్రత్యామ్మాయం లేదు. అందుకే ఇప్పుడు దేశంలో విరాళాలు కూడా బీజేపీకే ఎక్కువగా వస్తుండడం విశేషంగా మారింది.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి విరాళాలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. 2019-20 ఏడాదికి గాను ఎలక్ట్రోరల్ ట్రస్టుల ద్వారా ఆ పార్టీకి రూ.276.45 కోట్ల విరాళాలు రావడం విశేషం.దేశంలోని అన్ని పార్టీల విరాళాలతో పోలిస్తే ఒక్క బీజేపీకే 76.17 శాతం విరాళాలు రావడం గమనార్హం.
ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి రూ.58 కోట్లు (15.98శాతం) వచ్చినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక వెల్లడించింది.
ఇక బీజేపీకి ఇంతలా విరాళాలు ఇచ్చిన కంపెనీలు ఏంటని చూస్తే ‘జేఎస్ డబ్ల్యూ, అపోలో టైర్స్, ఇండియా బుల్స్, ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ఆథార్టీ, డీఎల్ఎఫ్ గ్రూపులు ఉన్నాయి. జేఎస్.డబ్ల్యూ కంపెనీయే ఏకంగా అత్యధికంగా రూ.39.10 కోట్లు విరాళంగా ఇచ్చిందట.. అపోలో టైర్స్ 30కోట్లు, ఇండియా బుల్స్ 25కోట్లు ఇచ్చాయి.
ఇక బీజేపీ, కాంగ్రెస్ కాకుండా ఇతర పార్టీలకు రూ.25.46 కోట్లు విరాళాలు అందాయి. దేశంలో ఉత్తరాధి పార్టీలకే ఈ విరాళాలు అందాయి.