Suryapet District: ఉన్నత చదువులు చదివినప్పటికీ సర్కారు కొలువులు తగ్గడం లేదు. ప్రైవేటు సంస్థల్లో ఎప్పుడు ఉద్యోగాలు ఉంటాయో, ఎప్పుడు ఉద్యోగాలు ఊడుతాయో తెలియడం లేదు. ఫలితంగా ఉన్నత చదువులు చదివిన నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారు. కన్నవాళ్ళకు ఎన్ని రోజులు భారంగా ఉంటామని బాధపడుతున్నారు. ఇదే సమయంలో కొలువు కోసం ఎన్నో కష్టాలు పడుతున్నారు.. మొన్నటికి మొన్న తెలంగాణలో ఉద్యోగ నియామక పరీక్ష వాయిదా పడిందని ప్రవళిక అనే ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది (తర్వాత దీనిని ప్రేమికుడు వేధింపుల వల్లే అని మార్చారు). దీనిని మర్చిపోకముందే తెలంగాణ రాష్ట్రంలో మరొక దారుణం చోటుచేసుకుంది.
సర్కారు ఉద్యోగాలకు సంబంధించిన నియామక ప్రకటనలు, పరీక్షల నిర్వహణలో జాప్యం వల్ల యువతీ యువకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇదే క్రమంలో ప్రైవేటు ఉద్యోగాల కోసం పోటీలు పడుతున్నారు. అయితే యువత ఆశలను సొమ్ము చేసుకునేందుకు కొంతమంది దళారులు రంగంలోకి దిగుతున్నారు. సహజంగా ఇలాంటి దందా ఐటి పరిశ్రమలో ఎక్కువగా సాగుతూ ఉంటుంది.. ఇలాంటి దళారుల చేతిలో పడి ఓ యువతి నిండా మునిగింది. మోసపోయానని గ్రహించి చివరికి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సూర్యపేట జిల్లా చింతలపాలెం మండలం, కొత్తగూడెంలో చోటుచేసుకుంది. కొత్తగూడెం గ్రామానికి చెందిన కర్లపూడి సుబ్బారావు రెండవ కుమార్తె కర్లపూడి మౌనిక (22) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మౌనిక కోదాడలోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతోంది. అయితే ఆమెకు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం ఇస్తారని చెప్పి కొందరు నమ్మించారు. వారి మీద నమ్మకంతో ఆమె తన స్నేహితురాలు వద్ద 28000 అప్పుగా తీసుకుంది. ఆ నగదు కూడా స్నేహితుల కుటుంబ సభ్యుల డెబిట్ కార్డు ద్వారా చెల్లించింది. అయితే ఆ తర్వాత ఆమెకు ఉద్యోగం ఇస్తామని చెప్పిన వ్యక్తులు ఎటువంటి సమాధానం చెప్పలేదు. ఇదే క్రమంలో డబ్బు అప్పుగా ఇచ్చిన స్నేహితులు మౌనికపై ఒత్తిడి తేవడం ప్రారంభించారు. మౌనిక కొంతమేర అప్పు చెల్లించింది. మిగతా సొమ్మును ఇవ్వాలని వారు అడగడం.. ఈ విషయంలో కళాశాల హెచ్వోడీ ఒకరు జోక్యం చేసుకొని మౌనికపై ఒత్తిడి తీసుకొచ్చారు. లేకుంటే పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్ ఇవ్వబోమని హెచ్చరించారు.
ఈ పరిణామాలన్నీ మౌనికను తీవ్ర ఒత్తిడికి గురిచేశాయి. ఈ క్రమంలోనే కళాశాల యాజమాన్యం దసరా సెలవులు ప్రకటించింది. దీంతో మౌనిక ఇంటికి వచ్చింది. గురువారం ఉదయం ఆమె తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లడంతో.. ఇంటి వద్ద మౌనిక ఒక్కతే ఉంది. స్నేహితుల వద్ద తీసుకున్న అప్పును తిరిగి ఎలా చెల్లించాలో తెలియక పురుగుల మందు తాగింది. మౌనిక అపస్మారక స్థితికి వెళ్లడంతో గమనించిన చుట్టుపక్కల వారు ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తుండగానే కన్ను మూసింది. ఈ విషయం తెలుసుకున్న స్నేహితులు కొత్తగూడెంలోని మృతురాలు ఇంటి వద్దకు గురువారం రాత్రి చేరుకున్నారు. ఉద్యోగం ఇస్తామని చెప్పిన వారు, డబ్బులు ఇచ్చి ఒత్తిడి చేసిన వారు, మధ్యలో జోక్యం చేసుకున్న వల్లే మౌనిక తనువు చాలించిందని వారు వాపోయారు. అంతేకాదు మౌనిక తల్లిదండ్రులకు ఏం జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే మౌనిక స్నేహితులు భారీగా రావడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా దీనిపై మౌనిక తల్లిదండ్రులు పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. మౌనిక చదువుతున్న కళాశాల యాజమాన్యం ప్రస్తుతం వారితో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది.