Chandrababu Polavaram Tour: టిడిపి అధినేత చంద్రబాబు వైసీపీ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గణాంకాలతో సహా వివరాలు వెల్లడిస్తున్నారు. ఆయన విమర్శలపై వైసిపి పెద్దగా స్పందించలేకపోతోంది. వైసీపీ సర్కారు లో డొల్లతనం స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబు విమర్శలు తట్టుకోలేక పుంగనూరు లాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని వైసీపీ సర్కార్ పై ఒక అపవాదు పడింది.
ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు వైసీపీ సర్కార్ను ఇరకాటంలో పెట్టారని చెప్పవచ్చు. జగన్ సర్కారులో ఒకరిద్దరు మంత్రులు తప్పించి.. మిగతా వారంతా జూనియర్లు. విధానపరమైన అంశాలను మాట్లాడేది ఒకరిద్దరు మాత్రమే. కేవలం ఎదురుదాడికి, తిట్ల దండకానికే ఎక్కువమంది అక్కరకు వస్తున్నారు. చంద్రబాబు గణాంకాలతో సహా వివరిస్తుంటే.. దానికి కౌంటర్ ఇవ్వలేక బేల చూపులు చూస్తున్నారు. దీంతో చంద్రబాబు వైసీపీ సర్కార్ వైఫల్యాన్ని ప్రజలకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు.
అయితే పోలవరం ప్రాజెక్టు సందర్శనలో మాత్రం చంద్రబాబు వైఫల్యం స్పష్టంగా కనిపించింది. చంద్రబాబు చేసిన విశ్లేషణలో డొల్లతనం వెలుగు చూసింది. పోలవరం ప్రాజెక్టులో సుడిగుండం ఏర్పడడం వల్లే డయాఫ్రమ్ వాల్ ధ్వంసం అయిందని చంద్రబాబు విశ్లేషించారు. దీనిపై నీటిపారుదల శాఖ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంపై స్పందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మిన్న కుండా పోయారు. దీంతో తమకెందుకులే అని సాగునీటి నిపుణుల సైతం మౌనంగా ఉన్నారు. లక్షలకు లక్షలు జీతాలు తీసుకొని.. కనీసం ప్రభుత్వం పై విమర్శలను కూడా ఎదుర్కొన లేకపోతే.. మరెందుకంటూ వైసీపీ వర్గాలే ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
టిడిపి హయాంలో రూపొందించిన పోలవరం ప్రాజెక్టు డిజైన్లలో లోపాలు ఉన్నట్లు సాగునీటి శాఖ నిపుణులు చెబుతున్నారు. అప్పర్ కాపర్ డ్యాం ను నాన్ ఓవర్ ఫ్లోర్ డ్యాం గా డిజైన్ చేశారు. దీనివల్లే ప్రస్తుతం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కానీ చంద్రబాబు మసిపూసి మారేడు కాయ చేస్తున్నారు. ఇదంతా వైసీపీ ప్రభుత్వ వైఫల్యంగా చెప్పుకొస్తున్నారు. అయినా సరే వైసీపీ నుంచి ఆ స్థాయిలో స్పందన లేదు. చంద్రబాబు విమర్శలపై దీటైన కౌంట్ ఇవ్వలేకపోతున్నారు. ఇది ముమ్మాటికీ వైసీపీ సర్కార్ వైఫల్యమే. నోరు పారేసుకునే మంత్రులు, నాయకులు చంద్రబాబుపై విధానపరంగా పోరాడలేకపోతున్నారు. అది అంతిమంగా చంద్రబాబుకి లాభిస్తోంది. వైసీపీ సర్కార్ కు నష్టం చేకూరుస్తోంది.