INDIA Alliance: చంద్రబాబు ఇండియా కూటమిలోకి వెళ్తారా? బిజెపి నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేదా? అందుకే ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నారా? అనే దాని పైన ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇటీవల ఆయన ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెడతానని అర్థం వచ్చేలా మాట్లాడారు.ముందుగా తన టార్గెట్ ఏపీ అని.. అక్కడ గెలిచాక జాతీయ రాజకీయాల్లో భాగమవుతానని ప్రకటించారు.
చంద్రబాబు ఇటీవలే ఢిల్లీ వెళ్లి జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలిశారు. బిజెపితో పాటు ప్రధానిపై సానుకూల వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో ఇండియా కూటమి ప్రస్తావన కూడా వచ్చింది. సీనియర్ రాజకీయ నాయకులు ఎవరు ప్రధాని మోదీని విమర్శించలేరని.. ఇండియా కూటమికి నాయకత్వం లేమి బిజెపికి వరంగా పేర్కొన్నారు. మోదీ వల్లే ప్రపంచ దేశాల్లో భారత్ కు గుర్తింపు లభించిందని కొనియాడారు. అయితే ఇండియా కూటమికి నాయకత్వ లోపంపై చంద్రబాబు ప్రస్తావించడం ఆసక్తి గొలుపుతోంది.
సరిగ్గా ఇదే సమయంలో సిపిఐ నాయకుడు నారాయణ చంద్రబాబును ఇండియా కుటమిలోకి ఆహ్వానించారు. చంద్రబాబు వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటే ఏపీలో విజయం ఖాయమని నారాయణ ధీమా వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో బిజెపిని విభేదించి చంద్రబాబు నష్టపోయారు. ఇప్పుడు కానీ వామపక్షాల వైపు తిరిగితే బిజెపి నుంచి ఆశించిన స్థాయిలో చంద్రబాబు సహకారం లభించదు. పైగా శత్రువుకి మిత్రుడు కాబట్టి చంద్రబాబును అదే స్థాయిలో బిజెపి చూడడం ప్రారంభిస్తుంది. అప్పుడు జరిగే నష్టం చంద్రబాబుకు తెలుసు.
వాస్తవానికి చంద్రబాబు ఇండియా కూటమిలోకి వెళ్లాలనుకుంటే.. ఈపాటికే వెళ్లి ఉండేవారు. ముందుగా ఏపీలో అధికారంలోకి రావాలి. అందుకు బిజెపి సహకారం తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో బిజెపి జగన్ కు సహకరించకూడదు. వచ్చే ఎన్నికల్లో స్పష్టమైన గెలుపు కావాలి. అటు తర్వాతే జాతీయ రాజకీయాల వైపు చూడాలి. కేవలం ఈ వ్యూహాలతోనే చంద్రబాబు ముందుకు సాగుతున్నారు. 2024 ఎన్నికల తర్వాత బిజెపికి లభించే మెజారిటీ అనుసరించే.. జాతీయ రాజకీయాల్లో తన పాత్రను చంద్రబాబు తీర్చిదిద్దుకోనున్నారు. అంతవరకు ఎవరి ఆహ్వానాలు ఉన్న ఇండియా కూటమి వైపు చూసే చాన్సే లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.