Chandrababu: చంద్రబాబు కంటతడి పెట్టారు. అవినీతి కేసుల్లో అరెస్ట్ అయిన చంద్రబాబు జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. నిన్న హైకోర్టులో ఆయనకు మధ్యంతర బెయిల్ లభించింది. సాయంత్రం 4:45 గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరిన చంద్రబాబు కాన్వాయ్.. బుధవారం వేకువజామున 5 గంటలకు ఉండవెల్లి చేరుకుంది. కుటుంబ సభ్యులతో పాటు టిడిపి నాయకులు పెద్ద ఎత్తున అక్కడకు తరలివచ్చారు. నారా భువనేశ్వరి హారతి స్వాగతం పలికారు. మహిళలు గుమ్మడికాయలు కొట్టి దిష్టి తీశారు.
నందమూరి, నారా కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. చంద్రబాబు వారిని కలిశారు. ఈ సందర్భంగా కొందరు భావోద్వేగానికి గురై కన్నీరు మున్నీరయ్యారు. వారిని సముదాయించే ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు సైతం కంటతడి పెట్టారు. కొద్దిసేపటి తర్వాత చేరుకొని వారిని సముదాయించారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. అక్రమ కేసులకు భయపడేది లేదని.. న్యాయం గెలుస్తుందని వారికి ధైర్యం చెప్పారు.
గత 53 రోజులుగా చంద్రబాబు జైలు గోడల మధ్య గడిపారు.వరుస పిటిషన్లు,విచారణలు,వాయిదాలతో అయోమయం నెలకొంది. ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఏకకాలంలో కేసు విచారణలు కొనసాగాయి. కానీ ఎక్కడా చంద్రబాబుకు పోరాట దక్కలేదు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు బంధువులు తీవ్ర నైరాస్యంలోకి వెళ్లిపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు అనారోగ్యానికి గురికావడంతో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దీంతో కుటుంబ సభ్యులంతా హుటాహుటిన ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్దకు చేరుకున్నారు. ఓవైపు ఆనందం, మరోవైపు బాధతో కూడిన ఉద్విగ్న వాతావరణం అక్కడ నెలకొంది. చంద్రబాబును చూసిన వారంతా ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు. సమీప బంధువుల్లోని మహిళలు బోరును వినిపించారు. వారిని చూసిన చంద్రబాబు సైతం కంటతడి పెట్టారు. అక్కడే ఉన్న టిడిపి నేతల కళ్ళు సైతం చెమర్చాయి. ప్రస్తుతం ఈ ఫోటోలే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ ఫోటోలను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నాయి.