TDP BJP Alliance: వచ్చే ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. కానీ బీజేపీ నుంచి సరైన సిగ్నల్ రావడం లేదు. అదే సమయంలో పవన్ టిడిపి, బిజెపితో కలిసి వెళ్లాలన్న యోచనలో ఉన్నారు. ఇందుకోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అటు బిజెపి పెద్దలకు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. చంద్రబాబు సైతం ఢిల్లీ వెళ్లి హై కమాండ్ పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేశారు. అటు తరువాత పొత్తులపై ఎటువంటి ప్రకటన రాలేదు. ఒక విధంగా చెప్పాలంటే ప్రతిష్టంభన ఏర్పడింది. దీనికి చంద్రబాబు షరతులే కారణమని తెలుస్తోంది.
ఎన్నికల్లో ఓటమి అనంతరం చంద్రబాబులో ఆలోచన ప్రారంభమైంది. దూరమైన బీజేపీని దగ్గర చేసుకోవాలని ఆయన భావించారు. ఇందుకోసం ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. వచ్చే ఎన్నికల్లో బిజెపితో కలిసి వెళితేనే తనకు మేలు జరుగుతుందని చంద్రబాబు భావిస్తూ వచ్చారు. అందుకే ఢిల్లీ వెళ్లి మరి అమిత్ షా,నడ్డాను కలిసారు. అటు తర్వాత బిజెపి హై కమాండ్ పెద్దల ఆలోచనలో కూడా మార్పు ప్రారంభమైంది. ఏపీ వచ్చి జగన్ సర్కార్ పై విమర్శలను ప్రారంభించారు. దీంతో టిడిపి లైన్ లోకి బిజెపి వచ్చిందని అంతా భావించారు. రెండు పార్టీలు కలిసి పోతాయని లెక్కలు వేశారు. కానీ వాటి మధ్య దూరం తగ్గలేదు. అందుకు వైసిపి కారణం అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బిజెపి వైసిపి విషయంలో అనుసరిస్తున్న విధానాల వల్లే చంద్రబాబు ఓ నిర్ణయానికి రాలేకపోతున్నట్లు సమాచారం. గతవారం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. 9 పేజీల్లో సుదీర్ఘమైన ఆ లేఖలో ఏపీ ప్రభుత్వ రాజ్యాంగ ఉల్లంఘనలతో పాటు విపక్షాలపై అనుసరిస్తున్న తీరును వివరించారు. ఏపీలో తనకు ప్రాణహాని ఉందన్న సందేశం కూడా కేంద్రానికి పంపారు. వీటిపై కేంద్రం తీసుకునే చర్యల ఆధారంగా బిజెపితో కలిసి నడవాలని చంద్రబాబు భావిస్తున్నారు. బిజెపి తక్షణ చర్యలకు దిగితే ఎన్డీఏతో కలిసి నడిచేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. అందుకు తగ్గ సంకేతాలను కేంద్ర పెద్దలకు పంపారు. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే.
ఏపీలో అనుసరించాల్సిన వైఖరిపై బిజెపిలో ఒక రకమైన విభిన్న వాతావరణం ఉంది. వైసిపి సహకారం తీసుకుంటున్న బిజెపి ఆ పార్టీని మిత్రుడిగా చూడలేకపోతోంది. అటు బిజెపితో కలిసి నడిస్తే తమతో ఉన్న చాలా వర్గాలు దూరం అవుతాయని వైసిపి భయపడుతోంది. అలాగని బిజెపిని దూరం చేసుకుంటే ఇబ్బందులు తప్పవని భావిస్తోంది. అందుకే రాజకీయంగా సహకరిస్తుంది. దురదృష్టం కొద్దీ బిజెపికి మెజారిటీ రావడంతో ఏమీ చేయలేకపోతున్నామని చాలా సందర్భాల్లో జగన్ ప్రకటించారు. అందుకే జగన్ విషయంలో బిజెపి జాగ్రత్తగా ఉంటోంది. జాతీయ అవసరాల దృష్ట్యా దూరం చేసుకోలేకపోతోంది. ఇటువంటి తరుణంలో చంద్రబాబు లేఖ పై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.