Chandrababu
Chandrababu Remand: స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు రిమాండ్ ను మరో రెండు రోజులపాటు పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈరోజుతో చంద్రబాబు రిమాండ్ ముగియడంతో ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. చంద్రబాబును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏసీబీ జడ్జి ముందు హాజరయ్యారు. రిమాండ్ లో ఉన్నప్పుడు మీకు ఏదైనా సమస్య వచ్చిందా అని న్యాయమూర్తి చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు వాదనలు విన్న న్యాయమూర్తి రిమాండ్ ను రెండు రోజుల పాటు పొడిగించారు. రిమాండ్ ను శిక్షగా భావించొద్దని.. ఇది చట్టప్రకారం జరుగుతున్న ప్రక్రియ అని జడ్జి వ్యాఖ్యానించారు.
గత పది రోజులుగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.ఆయన రిమాండ్ గడువు ముగియడంతో ఈరోజు కేసు విచారణకు వచ్చింది. అయితే హైకోర్టులో క్వాష్ పిటిషన్ తీర్పు వెలువడనున్న నేపథ్యంలో రెండు రోజులు పాటు రిమాండ్ కే న్యాయమూర్తి మొగ్గు చూపారు. తాను ఏ తప్పు చేయలేదని.. తన గురించి దేశంలో అందరికీ తెలుసునని.. తనను అకారణంగా జైల్లో పెట్టారని.. తన బాధ, ఆవేదనంతా అదేనని చంద్రబాబు న్యాయమూర్తి ఎదుట తన వాదనలు వినిపించారు. అయితే చట్టం ముందు అందరూ సమానులేనని.. నీపై వచ్చినవి కేవలం ఆరోపణలు మాత్రమేనని.. దర్యాప్తులో అన్ని విషయాలు తెలుస్తాయని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఎల్లుండి వరకు రిమాండ్ గడువును పొడిగించారు.
చంద్రబాబుపై మరో మూడు కేసులకు సంబంధించి సిఐడి పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఆ కేసు విచారణలో భాగంగా సిఐడి కస్టడీ కోరుతూ వచ్చింది. అయితే నిర్ణయం తీసుకోవడానికి హైకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ అడ్డంకి గా మారింది. ఈ రివ్యూ క్వాష్ పిటిషన్ హైకోర్టులో ఉంది. దానిపై హైకోర్టు ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటన్నరకు తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. ఒకవేళ రిమాండ్ ను హైకోర్టు కొట్టి వేస్తే చంద్రబాబును కస్టడీలోకి తీసుకోవడం కుదరదు. అందుకే హైకోర్టు తీర్పు కీలకంగా మారింది. అందుకే కింద కోర్టులో కస్టడీపై న్యాయమూర్తి ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.