Chandrababu- Pawan Kalyan: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎవరు అధికారాన్ని చేజిక్కించుకుంటారు అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఒకొక్కరు ఒక్కో రకమైన ఊహాగానాలు చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి అయ్యేది ఎవరు, తెలంగాణలో ఎవరికి అధికారం దక్కునుంది అన్న అంశాలపై ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి తేల్చి చెప్పారు. ఏపీలో పొత్తుల చర్చ జరుగుతున్న వేళ.. కొన్ని పార్టీల మధ్య అంచనా వేస్తున్న పరిణామాలకు భిన్నంగా జరుగుతుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా ఆసక్తిని కలిగిస్తున్నాయి.
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రధాన పక్షాలైన తెలుగుదేశం పార్టీ, జనసేన పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని వచ్చే ఎన్నికలకు వెళ్లాలని సిద్ధమవుతున్నాయి. కుదిరితే బీజేపీని తమతో కలుపుకుని వెళ్లాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని చెబుతున్నారు.
రాష్ట్రంలో సరికొత్త రాజకీయ సమీకరణాలు..
రాష్ట్రంలో అందరూ అనుకుంటున్నట్లుగా రాజకీయ సమీకరణాలు ఉండవని వేణు స్వామి స్పష్టం చేశారు. టిడిపి, జనసేన పొత్తులో అనూహ్య పరిణామాలు ఉంటాయని పేర్కొన్నారు. తెలంగాణలో బిజెపి మూడో స్థానానికి పరిమితం అవుతుందని చెబుతూనే.. అధికారం ఎవరికి దక్కుతుందనే దానిపైనా ఆసక్తికరమైన విశ్లేషణ చెప్పుకొచ్చారు. పార్టీల ప్రకారం చూస్తే ఏపీలో తిరిగి జగన్ అధికారంలోకి రావటం ఖాయమని స్పష్టం చేశారు. జగన్ తొలి స్థానంలో ఉండగా చంద్రబాబు రెండో స్థానంలో, పవన్ కళ్యాణ్ మూడో స్థానంలో ఉంటారని చెప్పుకొచ్చారు. సీఎం అయ్యే యోగం జగన్ కు మాత్రమే ఉందని తేల్చి చెప్పారు. తాను ముందుగా చెప్పినట్టు రెండు రాష్ట్రాల్లోనూ అరెస్టులు కొనసాగుతాయని వెల్లడించారు. పార్టీల కలయికలో ఊహించని విధంగా పరిణామాలు చోటు చేసుకుంటాయని విశ్లేషించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలయిక జరిగినట్లే కనిపించినా.. ఏదైనా జరిగే అవకాశం ఉందంటూ వేణు స్వామి కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఆ రెండు పార్టీల పొత్తు తనకు ప్రశ్నగానే ఉందని ఆసక్తిని పెంచే విశ్లేషణ చేశారు.
జగన్ ను అడ్డుకోవడం కష్టమే.. పొత్తుపైనా అనుమానాలు..
జగన్మోహన్ రెడ్డిని ఓడించే ఉద్దేశంతో జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తుకు సిద్ధమవుతున్నాయి. దీనిపైనా వేణు స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి విజయాన్ని అడ్డుకోలేరని వేణు స్వామి స్పష్టం చేశారు. సీఎం జగన్ గురించి కొంతమంది వ్యతిరేకంగా చెబుతారని రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ద్వేషిస్తూ మాట్లాడతారని కానీ జగన్ గెలుపు ఖాయమని తేల్చి చెప్పారు. గురు గ్రహం నీచంలో ఉండడంతో జగన్ తిట్టే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని ఓట్లు మాత్రం జగన్ కే వేస్తారని విశ్లేషించారు. పవన్ కళ్యాణ్ కు జనాధారణ విపరీతంగా ఉంటుందని కానీ ఓట్లు పడవని చెప్పుకొచ్చారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకవేళ కలిస్తే జగన్ కు టఫ్ ఫైట్ ఇస్తారని, కానీ ఓడించలేరని వెల్లడించారు. ఏపీలో అధికార మార్పిడి వంటి అద్భుతాలు జరిగే అవకాశాలు లేవని వేణు స్వామి తన అంచనాగా వెల్లడించారు. ఏపీలో ముందస్తు ఎన్నికలే ఉంటాయని స్పష్టం చేశారు. కర్ణాటకలో తాను కాంగ్రెస్ పార్టీకి 130, 140 సీట్లు వస్తాయని చెప్పిన అంచనాలు నిజమయ్యాయని ఈ సందర్భంగా వేణు స్వామి గుర్తు చేశారు.
తెలంగాణలో హోరాహోరీ పోరు ఖాయం..
తెలంగాణపైనా ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు వేణు స్వామి. తెలంగాణలో ఒకటో స్థానం కోసం బిఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందన్నారు. బిజెపి మూడో స్థానంలో ఉంటుందని వెల్లడించారు. కర్ణాటక ఎన్నికలతో కాంగ్రెస్ మార్పు మొదలైందన్నారు. కేంద్ర రాజకీయాల్లోనూ అనూహ్య మార్పులు జరుగుతాయని వివరించారు. బిజెపికి సీట్లు తగ్గుతాయని హంగ్ ఏర్పడే అవకాశం ఉందని అంచనాగా చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశం లేదని వేణు స్వామి తేల్చి చెప్పారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం కీలక పాత్ర పోషిస్తుందని, కర్ణాటకలో గతంలో జెడిఎస్ కుమారస్వామికి వచ్చిన అవకాశం ఈసారి తెలంగాణలో ఎంఐఎంకు వచ్చే ఛాన్స్ ఉందని వివరించారు. కేంద్రంలోనూ ఎన్నికల నాటికి చాలా మార్పులు జరుగుతాయని వేణు స్వామి వివరించారు. తాజా విశ్లేషణలపై రాజకీయంగా ఆసక్తికరమైన చర్చ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జరుగుతోంది. చూడాలి రానున్న ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో.
Web Title: Chandrababu pawan kalyan who will be cm in 2024
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com