ఏపీ లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగబోతుంది. అదీ ఈ నెలలోనే ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ ఎన్నికలను వైస్సార్సీపీ 9 నెలల పాలనకు రెఫరెండం గా భావిస్తుంది. ఈ ఎన్నికతో మీడియా లో జరుగుతున్న ప్రచారానికి తెర పెట్టాలని జగన్ భావిస్తున్నాడు. రాజధానిపై రగులుతున్న రగడ కూడా ఈ ఎన్నికల ఫలితాల తర్వాత సద్దుమణుగుతుందని వైస్సార్సీపీ అంచనా వేస్తుంది. దానితో తెలుగు మీడియాలో , జాతీయ మీడియా లో జరుగుతున్న ప్రచారానికి కూడా ఫులుస్టాప్ పెట్టొచ్చని పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నారు.
ఇదంతా సాఫీగా జరిగిపోతుందనుకున్న సమయంలో హైకోర్టు ఇప్పుడున్న రిజర్వేషన్లను 50 శాతానికి కుదిస్తూ తీర్పిచ్చింది. దీనివలన బీసీ రిజర్వేషన్లు ఇప్పటికన్నా తగ్గుతాయి. ఓ విధంగా ఈ తీర్పు ఊహించిందే. దేశవ్యాప్తంగా ఇటీవలికాలంలో రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా అనేక తీర్పులు వెలువడ్డాయి. చివరగా తెలుగురాష్ట్రమైన తెలంగాణ విషయం లోనూ సుప్రీమ్ కోర్టు ఇదే తీర్పిచ్చింది. ఆ నేపథ్యంలో తిరిగి సుప్రీం కోర్టు కెళ్ళినా ఇంతకుమించి ఒరిగేమీలేదని అందరికీ తెలుసు. కాకపోతే జనంకోసం ఒక ప్రయత్నం చేసినట్లు నటించటం మించి ప్రయోజనమేమీలేదని ఏమాత్రం న్యాయపరిజ్ఞానం వున్న అందరికీ తెలుసు. జగన్ మోహన రెడ్డి , చంద్రబాబు నాయుడుతో సహా. ఈలోపల కేంద్రం స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన డబ్బులు ఎన్నికలు జరగలేదు కాబట్టి పక్కన పెట్టేసింది. ఈ సంవత్సరం 15వ ఆర్ధిక సంఘం స్థానిక సంస్థలకు నిధులు బాగానే కేటాయించింది. ఆ ప్రయోజనం రాష్ట్రం పొందాలంటే ఎన్నికైన సంస్థలు ఉండాలి. అందుకనే ఆంధ్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లకుండా ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకుంది. దీనివలన రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు రావటంతో పాటు రాజకీయ లబ్ది పొందాలనేది కూడా జగన్ ఆలోచనగా వుంది.
మరి దీనికి మిగతా పార్టీలు సన్నద్ధంగా ఉన్నాయా? ప్రజారంగంలో బలాబలాలు తేల్చుకోవటం కంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రత్యామ్నాయమేముంది? కానీ తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు కి భయం పట్టుకుంది. ఇప్పటిదాకా పొరపాటున ఒకసారి జగన్ కి ఓటేసి చింతిస్తున్నారని, ప్రస్తుతం రాజధాని వ్యవహారంతో ప్రజలు జగన్ని వ్యతిరేకిస్తున్నారని అనేక వేదికలపై, పత్రికా సమావేశాల్లో చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో గనుక అసెంబ్లీ ఎన్నికల తీర్పేవస్తే చంద్రబాబు నాయుడుకి నైతికంగా దెబ్బే . అందుకే దీనిపై ఎలాగైనా ప్రతివ్యూహం వెయ్యాలని ఆలోచిస్తున్నాడు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పు అందివచ్చిన అవకాశంగా భావిస్తున్నాడు. జగన్ ప్రభుత్వం బీసీ వ్యతిరేకి కాబట్టే సుప్రీం కోర్టు కి వెళ్లకుండా 50 శాతం రిజర్వేషన్ తోనే ఎన్నికలకు వెళ్తున్నాడని ఎదురుదాడి ప్రారంభించాడు. ప్రభుత్వం వెళ్లకపోయినా మా తరఫున సుప్రీం కోర్టుకి వెళ్తామని ప్రకటించాడు. ఎలాగైనా తిరిగి బీసీ లను తమ వైపుకి తిప్పుకోవాలనే తాపత్రయం కనబడుతుంది. దానితోపాటు సుప్రీం కోర్టు గనక స్టే ఇస్తే బీసీ ల అభిమానాన్ని చూరగొనటంతోపాటు ప్రస్తుతానికి ఎన్నికల్ని ఎదుర్కోవాల్సిన పనివుండదని భావిస్తున్నాడు. అప్పుడు జగన్ పై ఇప్పుడుచేస్తున్న ప్రచారాన్ని ఇంకా గట్టిగా చేయొచ్చనేది ఆలోచన. అదే ఎన్నికలు జరిగితే ఇప్పటిదాకా మీడియా అండతో చేస్తున్న ప్రచారానికి తెరపడినట్లే కాబట్టి ఎలాగైనా ఎన్నికలు జరగకుండా చూడాలనేదే చంద్రబాబు వ్యూహం.
ఇంతకీ ఎన్నికలు జరిగితే ఫలితం ఎలావుండబోతుంది? ఇదే అందరి మెదడుల్లో తొలుస్తున్న బిలియన్ డాలర్ల ప్రశ్న. రాజధాని రైతుల ఆందోళనలతో ఆంధ్రా రైతాంగం జగన్ కి వ్యతిరేకంగా నిలుస్తారా? లేక విశాఖ పరిపాలనా రాజధానితో ఉత్తరాంధ్ర మొత్తం తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉప్పెనలాగా జగన్ వైపు నిలబడతారా? రాయలసీమ కు విశాఖ దూరం కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రచారానికి మద్దత్తు తెలుపుతారా? అసలు గుండెకాయలాంటి గోదావరి జిల్లాల ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు? ఇవి అందరి మనస్సుల్లో వున్న సందేహాలు. జగన్ కి ఈ 9 నెలల్లో తాను తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలు, గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభం, మద్యపాన నియంత్రణ , ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనలాంటి పనులే గెలిపిస్తాయనే నమ్మకంలో వున్నాడు. అదే సమయంలో గుంటూరు, కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రాజధాని మార్పు ప్రభావం ఉంటుందని కూడా లోలోపల భయపడుతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాల్లో జగన్ కి పూర్తి అనుకూలంగా ఉండొచ్చునని ఆ పార్టీ వ్యూహకర్తలు అంచనా. అందుకనే చంద్రబాబు నాయుడు ఎన్నికలపై ఆందోళనగా వున్నాడని అర్ధమవుతుంది. ప్రజలు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పై అంచనాలతో ఓట్లు వేయరని అందరికీ తెలుసు. ఇంకా అంత పరిణితి ప్రజల్లో లేదనేది వాస్తవం. ఆ విషయం చంద్రబాబు నాయుడు కి కూడా తెలుసు.
ఇకపోతే మిగతా పార్టీల అవకాశాలు ఎలా ఉంటాయి? మూడో ప్రత్యామ్నాయంగా బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రకటించాయి. కానీ ఇప్పుడున్న అంచనాల ప్రకారం ఈ కూటమి ఈ ఎన్నికల్లో అంత ప్రభావం చూపించే అవకాశంలేదు. ఇప్పటికీ ఈ కూటమి తెలుగుదేశం బి టీం అని వైస్సార్సీపీ చేసిన ప్రచారం నుండి బయటపడలేకపోతుందనేది వాస్తవం. రాజధాని వ్యవహారంలో ద్వంద వైఖరితో ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిందని చెప్పొచ్చు. ఇప్పట్నించీ వచ్చే నాలుగు సంవత్సరాల్లో వుమ్మడి కార్యక్రమాలు తీసుకొని ప్రజలదగ్గరకు వెళ్తే సాధారణ ఎన్నికల్లో ఫలితం ఉండొచ్చు. అంతేగానీ ఈ స్థానిక ఎన్నికలవరకు దీని ప్రభావం అంతగా ఉండదు. ఇక వామపక్షాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఘనచరిత్రకు వారసులుగా మిగిలిన ప్రస్తుత నాయకత్వం పూర్తిగా కనుమరుగైపోయింది చెప్పొచ్చు. ప్రజలు ఈ రెండు పార్టీలను విస్మరించారు. అందుకనే ప్రస్తుతానికి జగన్ కి తిరుగులేదని అనిపిస్తుంది. అదే జగన్ వ్యుహంకూడా. ఈ స్థానిక ఎన్నికలతో అటు తెలుగుదేశాన్ని, ఇటు రాజధాని సమస్యని ఒక కొలిక్కి తేవొచ్చని గట్టిగా నమ్ముతున్నాడు. అలాగే చంద్రబాబు అనుకూల మీడియా పై , మేధావి వర్గంపై ఏమాత్రం విశ్వసనీయత వున్నా అదికూడా ఈ ఫలితంతో పూర్తిగా జీరో అవుతుందని నమ్ముతున్నాడు. అదేసమయంలో చంద్రబాబు నాయుడు ప్రచారశైలి చూస్తే బరిలో ముందే చేతులెత్తేసి ఓటమిని పరోక్షంగా అంగీకరించాడని అర్ధమవుతుంది.
An Independent Editor, Trend Stetting Analyst.
Read MoreWeb Title: Chandrababu naidu hands off local body elections
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com