ఎవరైనా ఒకసారి తప్పుచేసి బొక్కబొర్లా పడితే దాని నుంచి గుణపాఠం నేర్చుకుంటున్నారు. మళ్లీ అలాంటివి జరుగకుండా జాగ్రత్త పడతారు. ఇది రాజకీయాల్లో ఉన్నవారికి అత్యంత అవసరం. 40ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే బాబు మాత్రం చేసిన తప్పునే మళ్లీ మళ్లీ చేస్తుండటం చర్చనీయాంశంగా మారుతుంది. తెలంగాణ టీడీపీ విషయంలో చంద్రబాబు చేసిన తప్పునే ప్రస్తుతం ఏపీలోనూ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడిని కేసీఆర్ తన ట్రాప్ లోకి లాగి తెలంగాణలో టీడీపీ దెబ్బతీశారు. దీంతో తెలంగాణలో టీడీపీ కనుమరుగయ్యే పరిస్థితికి చేరింది.
Also Read: ఆంధ్రాలో మూడో ప్రత్యామ్నాయం సాధ్యమేనా?
ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు క్రమంగా జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో పడుతున్నారు. గతంలో కేసీఆర్ అనుసరించిన వ్యూహాన్ని జగన్మోహన్ రెడ్డి ఏపీలో అమలు చేస్తున్నారు. టీడీపీని ఒక ప్రాంతానికి పరిమితం చేసేలా కేసీఆర్ నాడు ఎలా సక్సస్ అయ్యారో అలానే జగన్ కూడా పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ వ్యూహాంలో భాగంగానే మూడు రాజధానుల అంశం తెరపైకి తీసుకొచ్చారు. ఈ ట్రాప్ లో చంద్రబాబు నాయుడు ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది.
చంద్రబాబు నాయుడిని అమరావతికే పరిమితం చేయడం ద్వారా మిగిలిన ప్రాంతంలో టీడీపీకి ఎదురుదెబ్బ తగులుతున్నాయి. జగన్ మూడు రాజధానుల అంశంతో అన్ని ప్రాంతాల్లో వైసీసీ బలపడుతోంది. ఇక టీడీపీ మాత్రం జై అమరావతి స్లోగన్ తీసుకోవడంతో రాయలసీమ, ఉత్తారంధ్రలో ఆ పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. చంద్రబాబు ఏపీకి సీఎం అయ్యాక తెలంగాణపై పెద్దగా దృష్టి సారించకపోవడంతో ఈ ప్రాంతంలో దాదాపుగా టీడీపీ కనుమరుగైంది. ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేవలం అమరావతి రాజధానిపైనే ఫోకస్ పెట్టి మిగిలిన ప్రాంతాలను పట్టించుకోవడం లేదు. దీంతో ఈ ప్రాంతాల్లో టీడీపీ కనుమరుగు అవడం ఖాయమనే వాదనలు విన్పిస్తున్నాయి.
Also Read: బీజేపీ-జనసేన పొత్తులో సీఎం అభ్యర్థి ఎవరు?
చంద్రబాబు నాయుడు తన అనుభవంతో కర్నూలు, విశాఖ ప్రాంతాలను ఏవిధంగా అభివృద్ధి చేయాలో చెప్పి అమరావతి రాజధానికి మద్దతు ప్రకటిస్తే రాజకీయంగా అన్ని ప్రాంతాల్లో టీడీపీకి మైలేజ్ ఉండేది. కానీ బాబు మాత్రం కేవలం జై అమరావతి స్లోగన్ తీసుకోవడంతో మిగిలిన ప్రాంతాల్లో టీడీపీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. తమ ప్రాంతానికి రాజధాని వస్తే బాబు అడ్డుకుంటున్నారని ప్రజల్లో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో టీడీపీ నేతలు ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నారు.
ఇక టీడీపీ నేతలు చేసేదిలేక అధికార పార్టీలోకి జంప్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. బాబును ఒక ప్రాంతానికి పరిమితం చేయడంలో జగన్ సక్సస్ అవుతున్నారు. టీడీపీ కేవలం అమరావతికే పరిమితం అయితే వచ్చే ఎన్నికల్లో బాబు అధికారంలోకి రావడం అనేది కలగానే మిగిలిపోనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చంద్రబాబు ఇకనైనా జగన్ ట్రాప్ నుంచి బయట పడుతారో లేదో వేచి చూడాల్సిందే..!