Chandrababu Bail: చంద్రబాబు అరెస్టు, రిమాండ్ పై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. కావలిసే కేసులో ఇరికించారని.. ఏ 37 గా ఉన్న చంద్రబాబును రిమాండ్ విధించడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆయన తరుపు వాదించిన లాయర్లపై అనుమానం వ్యక్తం అవుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు ట్విట్ చేశారు. ఈ కేసు విషయంలో చంద్రబాబు తరుపు లాయర్ల ఆలోచన సరికాదని తేల్చి చెప్పారు. దీంతో ఇది వైరల్ అంశంగా మారింది.
సిఐడి రిమాండ్ రిపోర్ట్ పై సైతం సిపిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సిఐడి రిమాండ్ నివేదికలో కాకమ్మ కబుర్లు కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్టు చేయడం ముమ్మాటికీ తప్పిదమేనని తేల్చి చెప్పారు. తప్పుడు సమాచారంతో నివేదిక సమర్పించిన విషయాన్ని ప్రస్తావించారు. సిఐడి పోలీసులు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 17 ఏ కింద గవర్నర్ ముందస్తు అనుమతి అవసరమని తేల్చి చెప్పారు. చంద్రబాబుపై మోపిన నేరారోపణకు సంబంధించి వారి వద్ద ఎటువంటి సాక్షాధారాలు లేవని స్పష్టమవుతుందని చెప్పుకొచ్చారు. అసలు కేసుకు సంబంధంలేని కేసులను అన్వయించారని, ఉటంకించారని పేర్కొన్నారు. అందుకు సంబంధించి స్క్రీన్ షాట్లను సైతం తన ట్విట్ కు జత చేశారు.
2024లో కింజరాపు అచ్చెనాయుడు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఎంపీ కేసులో ఉటంకించిన తీర్పు హైకోర్టుది కాగా.. దానిని సుప్రీంకోర్టు తీర్పుగా చూపించారని నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి యశ్వంత్ సిన్హా వర్సెస్ సిపిఐ కేసులో అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 70 ఏను అన్వయించడంపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ విషయాలన్నింటినీ చంద్రబాబు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని నాగేశ్వరరావు సూచించారు. చంద్రబాబుకు బెయిల్ రాకుండా ఉండేందుకే శనివారం అరెస్టు చేశారని.. ఇది కుట్రపూరితంగా జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాన్ బెయిలబుల్ కేసుల్లో అరెస్ట్ అయితే.. వెంటనే కోర్టులో బెయిల్ పిటిషన్ వేయాలని.. అప్పుడే బెయిల్, రిమాండ్ పిటిషన్లను ఏకకాలంలో విచారించే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. కానీ చంద్రబాబు లాయర్లు బెయిల్ పిల్ వెయ్యకపోవడాన్ని తప్పు పట్టారు. కేవలం రిమాండ్ పైనే పిటీషన్ వేయడంతో.. కోర్టు బెయిల్ పై విచారించలేదని భావించారు. అందుకే చంద్రబాబుకు బెయిల్ లభించలేదని అభిప్రాయపడ్డారు.