Chandrababu Jail: చంద్రబాబు అరెస్టుకు నేటితో 50 రోజులు అయ్యింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. స్కిల్ స్కామ్ లో సెప్టెంబర్ 10న చంద్రబాబును నంద్యాలలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేరుగా రోడ్డు మార్గంలో విజయవాడ తీసుకొచ్చి ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. అప్పటి నుంచి ఆయనకు కోర్టులో ఊరట దక్కడం లేదు. రిమాండ్ కొనసాగుతోంది.
అయితే అక్రమ అరెస్టులు చంద్రబాబును అరెస్టు చేశారని కుటుంబ సభ్యులు,తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అన్ని ఆధారాలతో చంద్రబాబు అరెస్ట్ చేసామని సిఐడి చెబుతోంది. అటు చంద్రబాబు సైతం ఆది నుంచి తనపై ఉన్న కేసుల కొట్టివేతకు క్వాష్ పిటిషన్ పై ఆధారపడ్డారు.ప్రస్తుతం ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. తీర్పు పెండింగ్ లో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు అనారోగ్యానికి గురయ్యారు. అటు జైలులో భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తనను అంతమొందించేందుకు కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేస్తూ ఏకంగా ఏసీబీ జడ్జి కు మూడు పేజీల లేఖను రాశారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇదే కీలకంగా మారింది.
చంద్రబాబు కుమారుడు, పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తాజాగా స్పందించారు. అక్రమ కేసుల్లో తన తండ్రిని బంధించి 50 రోజులు అవుతోందని.. ఏ తప్పు చేయకపోయినా వ్యక్తిగత కక్షతోనే ఆయన్ను అరెస్టు చేశారని ఆరోపించారు. శనివారం తండ్రి చంద్రబాబును తల్లి లోకేశ్వరితో కలిసి ములాఖత్ లో కలిశారు. అనంతరం జైలు బయట ఉద్విగ్నంగా మాట్లాడారు. రాష్ట్రంలో వ్యక్తిగత కక్ష సాధింపులు ప్రత్యక్షంగా చూస్తున్నామని చెప్పుకొచ్చారు. రాజకీయ ప్రత్యర్థులు ఓడిపోయేందుకు కష్టపడడం సహజమే. కానీ వైసీపీ నేతలు కొందరు చంద్రబాబు చావును కోరుకుంటున్నారు. చంద్రబాబును చంపేస్తామని బాహటంగానే మాట్లాడుతున్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్న తన తల్లి భువనేశ్వరిని సైతం అరెస్టు చేస్తామని చెబుతున్నారని.. ఆమె ఏం అన్యాయం చేశారని ప్రశ్నించారు. 50 రోజులుగా చంద్రబాబును జైలులో ఉంచి ఏం సాధించారని నిలదీశారు. ఒక్క ఆధారం అయినా చూపించారా? ఇది ముమ్మాటికి కక్ష సాధింపు చర్య అని లోకేష్ స్పష్టం చేశారు. చంద్రబాబును బయటకు రాకుండా చేయడానికి లాయర్లకి కోట్లాది రూపాయలు ముట్ట చెబుతున్నారని లోకేష్ ఆరోపించారు.
అయితే చంద్రబాబు అనారోగ్యం, జైలులో భద్రత విషయంలో ప్రజల్లో ఒక రకమైన అయోమయం నెలకొంది. చంద్రబాబును హత్య చేస్తామని మావోయిస్టుల పేరుతో లేఖ వచ్చిందని.. జైలు పై డ్రోన్ కెమెరా తిరిగిందని.. పెన్ కెమెరాతో చంద్రబాబును ఫోటోలు తీశారని రకరకాల వార్తలు వచ్చాయి. దీనిపై జైలర్ రవి కిరణ్ రెడ్డి, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ స్పందించారు. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టారు. అందులో కొన్ని నిజాలేనని తేల్చి చెప్పారు. అయితే ఎవరు చేశారో మాత్రం వెల్లడించలేకపోయారు. మరి కొన్ని ఫేక్ అని నిర్ధారించారు. అవి కూడా ఎవరు చేశారో కనీసం చెప్పలేదు. ఇప్పుడు లోకేష్ తో పాటు టిడిపి నేతలు సైతం చంద్రబాబు ఆరోగ్యం పై వేర్వేరుగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఒక ఉన్నత శ్రేణి వ్యక్తిగా, ఈ రాష్ట్రానికి సుదీర్ఘంగా పాలించిన నాయకుడిగా చంద్రబాబు ఉన్నారు. ఆయన విషయంలో ఒకటికి రెండుసార్లు వైసీపీ సర్కార్ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. లేకుంటే మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది.