https://oktelugu.com/

YCP: ఇక్కడ జనం బాధితులు.. పక్క రాష్ట్రంలో వైసీపీ నేతలకు వారే ప్రత్యర్థులు

సాధారణంగా ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులు ఆర్భాటాలకు దూరంగా ఉంటారు. వ్యక్తిగత, వ్యాపార పనుల నిమిత్తం వెళ్లినప్పుడు సెక్యూరిటీ ని తీసుకెళ్లరు. అటువంటి పరిస్థితుల్లో అక్కడున్న స్థానికుల నుంచి నిరసన ఎదుర్కొంటున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : October 28, 2023 6:38 pm
    YCP

    YCP

    Follow us on

    YCP: వైసీపీ నేతలు జనాలను కొట్టడం కాదు.. జనాలే వైసిపి నేతలను తరుముతున్నారు. అయితే ఏపీలో వైసీపీ నేతలు జనాలు పై పడుతుండగా.. ఇతర రాష్ట్రాల్లో మాత్రం వైసీపీ నేతలు కనిపిస్తే చాలు జనాగ్రహం వ్యక్తమవుతోంది. తాజాగా మంత్రి అంబటి రాంబాబు పై ఏకంగా దాడి చేసే ప్రయత్నం జరిగింది. దీనికి కారణం ముమ్మాటికీ వైసీపీ నేతల వ్యవహార శైలే. రాజకీయాల్లో సైద్ధాంతిక విమర్శలకు చోటు ఉంటుంది కానీ.. వ్యక్తిగత విమర్శలు శృతి మించితే ఈ పరిస్థితి వస్తుంది. తప్పకుండా జనాగ్రహం వ్యక్తమౌతోంది. అయితే ఇందులో విచిత్రం ఏమిటంటే.. ఏపీలో ప్రజలు మౌనంగా భరిస్తుండగా.. ఇతర రాష్ట్రాల్లో మాత్రం ఎదురు తిరుగుతున్నారు.

    సాధారణంగా ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులు ఆర్భాటాలకు దూరంగా ఉంటారు. వ్యక్తిగత, వ్యాపార పనుల నిమిత్తం వెళ్లినప్పుడు సెక్యూరిటీ ని తీసుకెళ్లరు. అటువంటి పరిస్థితుల్లో అక్కడున్న స్థానికుల నుంచి నిరసన ఎదుర్కొంటున్నారు. కొద్దిరోజుల కిందట మాజీ మంత్రి పేర్ని నాని హైదరాబాదు రోడ్లమీద కనిపించారు. ఆయన అక్కడ ఉంటారని ఎవరికీ తెలియదు. ఏదో వ్యక్తిగత పని మీద వచ్చినట్టున్నారు. కనీసం గన్మెన్లు కూడా లేరు. దీంతో అక్కడున్న స్థానికులు తమదైన రీతిలో ఆయన వద్ద నిరసన తెలిపారు. దీంతో హుటాహుటిన ఆయన కారెక్కి వెళ్లిపోయారు. తాజాగా ఖమ్మం లో అంబటి రాంబాబుకు అదే పరిస్థితి ఎదురైంది. దాదాపు దాడి చేసినంత పని చేశారు.

    అయితే సొంత రాష్ట్రంలో పోలీసులు ఏ స్థాయిలో ఉక్కు పాదం మోపుతున్నారో ప్రజలకు తెలియంది కాదు. అందుకే ప్రజలు కూడా పెద్దగా స్పందించడం లేదు. ప్రధానంగా తమ నోటి దూలతో రాష్ట్ర పరువును గంగపాలు చేసే నేతల విషయంలో మాత్రం ఏపీ ప్రజలు ఎక్కడున్నా బాహటంగానే వ్యతిరేకిస్తున్నారు. కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, రోజా, అనిల్ కుమార్ యాదవ్, గుడివాడ అమర్నాథ్ లాంటి నేతలు తమకు తాము లాజిక్ గా మాట్లాడుతున్నామని భావిస్తున్నా.. ప్రజలు మాత్రం అలా భావించడం లేదు. ఏపీలో ఉండి వారిని వ్యతిరేకిస్తే వివాదాస్పదంగా మారాల్సిందే. కానీ ఇతర రాష్ట్రాల్లో ఇటువంటి పరిస్థితి ఉండదు. అక్కడ స్వతంత్ర భావజాలంతో మాట్లాడవచ్చు. అందుకే ఈ తరహా నాయకులను చూస్తున్న ప్రజలు.. ఏదో రకంగా బుద్ధి చెప్పాలని చూస్తున్నారు. ఒక్క వ్యాఖ్యలతో సరిపోదని భావించి చేతికి సైతం పని చెబుతున్నారు.

    ఏపీలో పోలీసులు, రౌడీయిజం, అధికారంతో విపక్షాలను, ప్రజలను కట్టడి చేస్తున్నారు. కానీ రేపు ఇవన్నీ కోల్పోయాక ఏమిటి అన్న ప్రశ్న ఎదురవుతోంది. మొన్నటికి మొన్న ఇష్ట రాజ్యాంగ వ్యవహరించిన ఒకరిద్దరు వైసీపీ కార్యకర్తలు సొంత పార్టీయే తమను అన్ని విధాలా వాడుకుని దారుణంగా వంచిందని భావించి… నడిరోడ్డుపై సొంత వాహనాలను తగులు పెట్టి నిరసన తెలిపారు. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో సైతం వైసీపీ వివాదాస్పద నాయకులపై తెలుగు ప్రజలు తిరగబడుతున్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం అనేది లేదు. ఇష్టా రాజ్యాంగ మాట్లాడడం, అడ్డగోలుగా వ్యవహరించడం పరిపాటిగా మారింది. తాము ఎవరికీ కొట్టినా.. తమను ఎవరు ప్రశ్నించినా వారే బాధితులుగా మిగులుతారే తప్ప చట్టం, న్యాయం ఇక్కడ కనిపించవు. అయితే ఫిబ్రవరి లేదా మార్చిలో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. ఆ తరువాత పరిస్థితి ఏంటి? ప్రభుత్వం మారిన తర్వాత వీరిలో ఒక్కరైనా ఏపీలో రోడ్డుమీదకు ధైర్యంగా రాగలరా? అన్న ప్రశ్న మాత్రం ఉత్పన్నమవుతోంది. ఏపీలో రాజకీయం కోసం జగన్ రాజకీయాన్ని మొదలుపెట్టారు. అది ఇప్పుడు రివర్స్ అవుతోంది. చర్యకు ప్రతి చర్య అన్నట్టు పరిస్థితి మారుతోంది. వైసీపీ నేతలకు భవిష్యత్తు బెంగ పట్టుకుంది.