Chalo Vijayawada: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్య తీరిందని ప్రభుత్వం అనుకున్న నేపథ్యంలో… మరోసారి టీచర్లు, తాత్కాలిక ఉద్యోగుల నుంచి ఎదురీత మొదలు కానుంది. పీఆర్సీ ప్రకటన నేపథ్యంలో ఉద్యోగులతో ప్రభుత్వం జరిపిన చర్చల తరువాత చివరి నిమిషంలో సమ్మెను వాయిదా వేశారు. అయితే ఈ చర్చలు ఉపయోగకరం లేవని ఉపాధ్యాయులు, తాత్కాలిక ఉద్యోగులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు సమ్మెకు దిగబోతున్నారు. ఈ మేరకు ఉద్యమ కార్యారచరణను ప్రకటించారు. దశల వారీగా ఉద్యమం చేపట్టి చివర్లో సమ్మె చేస్తానని తెలపడం హాట్ టాపిక్ గామారింది.
ప్రభుత్వం గత నెలలో ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగ, ఉపాధ్యాయులు అసంతృప్తి చెందారు. ఫిట్మెంట్ 23 శాతంపై భగ్గుమన్నారు. అలాగే హెచ్ఆర్ ఏ తగ్గింపుపై ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కొన్ని రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తరువాత ‘చలో విజయవాడ’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వంలో కదలిక వచ్చింది. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలంటూ ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించారు. సుదీర్ఘ సమయంపాటు చర్చలు జరిపిన తరువాత ఉద్యోగ సంఘాలు సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని ప్రస్తుతానికి ఆందోళన చేయొద్దని నిర్ణయించారు.
అయితే ఈ చర్చలు ఉపయోగకరం లేవని ఉపాధ్యాయ సంఘాలు తెలిపారు. అశోత్ మిశ్రా కమిటీ నివేదిక బయటపెట్టకుండానే చర్చలను ఎలా పూర్తి చేస్తారని ఉద్యోగ సంఘాలపై టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కమిటీ 18 శాతం ఫిట్మెంట్ సిఫార్సు చేస్తే ప్రభుత్వం 23 శాతం ఫిట్మెంట్ ప్రకటించిందని అన్నారు. అయితే 23 శాతం ప్రకటనపైనే ఉద్యోగులు ఆందోళన చేసిన నేపథ్యంలో ఫిట్మెంట్ విషయంలో యూటర్న్ తీసుకోవడంపై టీచర్లు భగ్గుమన్నారు. దీంతో టీచర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు జేఏసీగా ఏర్పడి ఉద్యమం చేస్తానని ప్రకటించారు.
ఇందులో భాగంగా ఈనెల 15 నుంచి జిల్లాల సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. 20 వరకు మంత్రులు, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు సమర్పిస్తారు. మార్చి 6న విజయవాడలో నిరసన దీక్షలు చేపడుతారు. ఆ లోపు పట్టణాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. మార్చి 6 తరువాత మండలాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసి ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని అనుకున్నారు. ఇక గతంలో నిర్వహించిన మాదిరిగానే మరోసారి ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
ఇదివరకు నిర్వహించిన ‘చలో విజయవాడ’ కార్యక్రమంతో ప్రభుత్వం దిగి వచ్చింది. ఆ సమయంలో టీచర్లు రకరకాల వేషధారణతో విజయవాడకు తరలివచ్చారు. అయితే ఇప్పుడు ఉద్యోగులు లేనందున టీచర్లు, తాత్కాలిక ఉద్యోగుల జేఏసీ ఏర్పడి మరోసారి చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. అయితే ఈ కార్యక్రమంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందోననే ఉత్కంఠ నెలకొంది.