రాష్ట్ర రాజధాని విషయంలో ప్రస్తుత పరిణామాలు కీలకంగా మారాయి. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను వైసీపీ ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపింది. గవర్నర్ ఆమోదం లభిస్తే ఈ బిల్లులు చట్ట రూపంలోకి మారతాయి. మూడు రాజధానుల విషయంలో ప్రతిపక్ష పార్టీలన్నీ స్పష్టమైన వైఖరి కలిగి ఉండగా బీజేపీ వైఖరి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ పార్టీ రాష్ట్ర నేతలు ఓ వైఖరితో ఉంటే జాతీయ స్థాయి నేతలు మరో వైఖరి అవలంభించడం విమర్శలకు తావిస్తోంది.
Also Read: జమిలి ఎన్నికలతో మునిగేది చంద్రబాబేనా?
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు చేరిన వెంటనే వాటిని ఆమోదించవద్దని తొలుత లేఖ రాసింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, అనంతరం ఇతర పార్టీ నేతలు లేఖలు రాశారు. కన్నా లక్ష్మీనారాయణ గవర్నర్ కు లేఖ రాసిన అంశాన్ని ఆ పార్టీ జాతీయ నాయకత్వం సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం. లేఖ రాయడాన్ని తప్పుబట్టిన కేంద్ర నాయకత్వంపై పలు పార్టీలు, ప్రజా సంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. బీజేపీ రెండు నాలుకల ధోరణికి ఇది నిదర్శనమని ఆరోపిస్తున్నారు. ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం రాష్టంలోని అధికార పక్షంపై పోరాడుతుంటే, కేంద్ర నాయకత్వం మాత్రం అనుకూలంగా వ్యవహరిస్తూ వైసీపీ ప్రభుత్వానికి సహకరిస్తుందనడానికి ఇది మరో నిదర్శనమంటున్నారు. బీజేపీ అధిష్టానం మాత్రం రాజధాని వ్యవహారం రాష్ట్ర పరిధిలో ఉందని తాము జోక్యం చేసుకోమని గతంలోనే తేల్చేసింది. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి లేఖ విషయంలో కన్నాపై ఫైర్ అయ్యారు. బీజేపీ కేంద్ర నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసిందని చెప్పుకొచ్చారు.
Also Read: ఆన్ లైన్ క్లాసుల్లో కూడా బస్సు ఫీజ్ కట్టాలా?
రాజధాని విషయంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వంలోను అనేక లుకలుకలు ఉన్నాయి. కొందరు నేతలు రాజధాని అమరావతికి మద్దతు ఇస్తుంటే మరికొందరు అమరావతికి వ్యతిరేకంగా ఉంటున్నారు. ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన వారంతా అమరావతికి మద్దతు పలుకుతుంటే స్వతహాగా బీజేపీలో ఉన్న నాయకులు మాత్రం అమరావతికి అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. తాజాగా హిందుత్వ సంస్థల పేరుతో అమరావతి మద్దతు తెలుపుతున్న విషయంలోను… రాజకీయ ప్రయోజనాలతోనే ఈ వ్యవహారం సాగుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి.
బీజేపీ అధిష్టానం కన్నాపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయంపై జోరుగా చర్చ జరుగుతున్న కన్నా గాని లేక ఆ పార్టీ నాయకులు గాని ఎవరూ ఇప్పటి వరకు ఈ అంశంపై స్పందించలేదు. రాజధానిగా అమరావతిని బలంగా కోరుకుంటున్న వారంతా కన్నా చర్యలను సమర్ధిస్తున్నారు. ఆయనను అభినందిస్తున్నారు. అయితే మూడు రాజధానుల విషయంలో మాత్రం వైసీపీ ప్రభుత్వం వెనుకడుగు వేసే ప్రసక్తే లేదంటుంది.