YS Viveka’s murder : వారందరూ రక్తసంబంధీకులే. ఒకరి తర్వాత ఒకరు తోబుట్టినవాళ్లే. ఓ ప్రాంతాన్ని సామంత రాజ్యంగా చేసుకుని అప్రతిహతంగా ఏలుతున్నవాళ్లే. అధికారవాంఛ వారింట్లో నిప్పులుపోసింది. ఒకరి ప్రాణాలంటే ఇంకొకరికి విలువ లేకుండా చేసింది. సొంతవారినే ప్రత్యర్థులుగా మార్చేసింది. ఇంటికి పెద్దదిక్కును దూరం చేసింది. ఇప్పుడు ఆ కేసులో రక్తబంధువే విచారణకు రావాల్సిన పరిస్థితి కల్పించింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసు అందించింది. విచారణకు రావాలంటూ ఆదేశించింది. అవినాష్ రెడ్డి విచారణకూ వెళ్లొచ్చారు. కానీ విచారణ తర్వాత అవినాష్ ముఖంలో రక్తపుచుక్క లేదంటే నమ్మశక్యంకాదు. విచారణలో సీబీఐ అవినాష్ రెడ్డి కాల్ డేటా గురించి ఆరా తీసినట్టు తెలుస్తోంది. వైఎస్ వివేకా హత్య తర్వాత ఎవరెవరికి కాల్ చేశారు ? ఆ సంభాషణల్లో ఏముంది ? అన్న వివరాలు అవినాష్ ను అడిగిందట. కానీ ఇప్పటికే సీబీఐ దగ్గర ఆ సమాచారం ఉంది. కానీ కన్ఫర్మేషన్ కోసం అవినాష్ నుంచి వివరాలు సేకరించిందట.
వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుల్ని మొదటి నుంచి జగన్ వెనకేసుకొస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా టీడీపీ ఆరోపిస్తోంది. అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇవ్వగానే జగన్ తన పర్యటనల్ని రద్దు చేసుకుని ఢిల్లీ పయనమయ్యారు. హత్య జరిగిన నాటి నుంచి కేసు దర్యాప్తు కాకుండా అడ్డుకున్నారు. ఒకానొక దశలో సీబీఐనే టార్గెట్ చేసే పరిస్థితి ఏర్పడింది. ఇదంతా ఎందుకు.. అసలు వివేకానందరెడ్డిని ఎవరు చంపారో ప్రపంచానికి తెలియకూడదా ?. సొంత బాబాయిని అతికిరాతకంగా చంపితే ఇంత వరకు దోషుల్ని పట్టుకోవడంలో ముఖ్యమంత్రికి ఎందుకు నిర్లక్ష్యం ? వైఎస్ వివేకా కూతురు ఢిల్లీకి, సుప్రీంకోర్టుకు తిరగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ?. కేసును ఏపీ నుంచి తెలంగాణకు మార్చాలన్న డిమాండ్ ఎందుకు వచ్చింది ? తన నాన్నను చంపిన వారికి శిక్షపడాలనుకోవడం తప్పా ? అన్న ప్రశ్నలు సామాన్యులకు కలుగుతున్నాయి.
బాధితుడికి న్యాయం జరగడం వారి హక్కు. ఆ హక్కును ఇప్పుడు కాలరాస్తున్నారు. వివేకా హత్య కేసులో నిందితుల్ని కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం తీవ్రంగా యత్నిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. సొంత బాబాయి విషయంలో ఇలా చేయడం ఏంటని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అధికార వాంఛ తప్ప మరో ఆలోచన లేదన్న చర్చ జరుగుతోంది. కేవలం అధికారాన్నికాపాడుకోవడమే పరమావధిగా పావులు కదుపుతున్నారన్న అపవాదు వచ్చింది. వివేకా హత్యలో బంధువుల ప్రమేయం పై సునీత అనుమానం వ్యక్తం చేసింది. ఆమె అనుమానం తీర్చాల్సిన బాధ్యత అన్నగా కాకపోయినా, ఒక పాలకుడిగా జగన్ పై ఉంది. అది ఆమె హక్కు. ప్రభుత్వం బాధ్యత. తప్పు చేయకున్నప్పడు నిజానిజాలు తేల్చి ప్రతిపక్షాల నోరు మూయించొచ్చు కదా.
వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి విచారణతో అసలు నిందితులు ఒక్కొక్కరుగా బయటపడతారు. హత్య తర్వాత ఎవరికి ఫోన్లు వెళ్లాయి ? ఎందుకు వెళ్లాయి ? ఏం మాట్లాడారు ? అన్న విషయం తేలితే వివేకా హత్యలో సూత్రధారులు, పాత్రధారులు అందరూ బయటికొస్తారు. ఇప్పుడు అవినాష్ ను సీబీఐ విచారిస్తుండటంతో వారందరికీ భయం పుట్టుకుందట. తమ పేరు ఎక్కడ బయటపడుతుందోనని వణుకుపుడుతోందట. సీబీఐ కేసును వేగవంతంగా పూర్తీ చేస్తే నిందితుల జాతకం బట్టబయలవుతుంది. కానీ ఏపీ ప్రభుత్వ వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉంది. వైఎస్ వివేకా కూతురు సునీతరెడ్డికి, ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్ ప్రభుత్వానికి ఉంది.