KCR – Jagan: ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకున్న పాలకులు ప్రజాబీష్టానికి అనుగుణంగా నడుచుకోవాలి. అంతేకానీ ఎదురు ప్రశ్నిస్తే తట్టుకోలేకపోవడం, తిరిగి కేసులు పెట్టించడం, సొంత పార్టీలో ఎదురు మాట్లాడే వ్యక్తిని సహించలేకపోవడం వంటివి చేయకూడదు. అలా చేస్తే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. పూర్వపు రోజుల్లో హిట్లర్ కూడా తనకు ఎదురు ప్రశ్నించే వారిని సహించలేకపోయేవారు. ఒకటి వారిని దారిలోకి తెచ్చుకోవడం, రెండోది తన దారికి అడ్డు లేకుండా చూసుకోవడం.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మోనోపోలీ విధానాన్ని వ్యవహరిస్తున్నారు. “ట్రస్ట్ నో వన్ కిల్ ఎనీ వన్. బీ ఓన్లీ వన్” అనే సామెత తీరుగా పాలన సాగిస్తున్నారు. ఇది వారికి, వారి అడుగులకు మడుగులు ఒత్తే వారికి బాగుంటుందేమో కానీ… చూసే జనానికి విసుగు పుట్టిస్తుంది..

ఎదురు ప్రశ్నను సహించలేరు
తెలంగాణలో చంద్రశేఖర రావు, ఆంధ్రా లో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా అహంకారానికి నిలువెత్తు ప్రతిరూపాలు. వారికి అవసరం ఉంటే వంగి వంగి దండాలు పెడతారు.. అది అవసరం లేకుంటే వంగోపెట్టిస్తారు. తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్నప్పుడు కెసిఆర్ కు ఈటెల రాజేందర్ కుడి భుజం లా ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర కేబినెట్లో మంత్రి అయ్యారు. మొదట్లో బాగానే ఉన్నప్పటికీ తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వారు ప్రజాప్రతినిధులు అవుతుండడంతో నేరుగా కేసీఆర్ ను ప్రశ్నించారు. అది మొదలు ఇద్దరి మధ్య గ్యాప్ న కు కారణమైంది. అది అంతకంతకు పెరిగింది. ఇదే సమయంలో వీలు దొరికినప్పుడల్లా ఈటెల రాజేందర్ గులాబీ పార్టీకి మేమే ఓనర్లమంటూ వ్యాఖ్యలు చేశారు. అసలే మంట మీద ఉన్న కేసీఆర్ కు ఇది మరింత కోపం తెప్పించింది. సీన్ కట్ చేస్తే ఈటల రాజేందర్ బర్తరఫ్ న కు దారి తీసింది. ఇక మొన్న నూతన సంవత్సర వేడుకల సందర్భంగా “భారత రాష్ట్ర సమితిలో మనకు దక్కుతున్న గౌరవం చూస్తున్నామని” ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎక్కడో తగిలింది. ఏముంది వెంటనే చర్యలకు రంగం సిద్ధమైంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి భద్రత సిబ్బంది సంఖ్య తగ్గింది.. ఇలా చెప్పుకుంటూ పోతే తనను ప్రశ్నించిన వారందరికీ కూడా శంకరగిరి మాన్యాలు చూపించిన ఘనత కేసిఆర్ కే దక్కుతుంది.

రెండు ఆకులు ఎక్కువే
జగన్మోహన్ రెడ్డి కూడా నిలువెత్తు అహంకారానికి ప్రతీక. చంద్రశేఖర రావు విషయంలో కొంత వెసలుబాటు ఉంటుందేమో కానీ… జగన్ విషయంలో అది మచ్చుకు కూడా కనిపించదు. తాను పర్యటిస్తున్నప్పుడు రోడ్ల చుట్టూ పరదాలు కట్టుకోవడం… తన తాడేపల్లి ప్యాలెస్ పరిసర ప్రాంతాల్లో జనావాసాలు ఉండకుండా చూసుకోవడం… జగన్ మోనోపోలి విధానానికి పరాకాష్ట.. తన తప్పులు రాసిన పేపర్లకు ప్రకటనలు ఇవ్వకుండా చూడటం ఆయన పైశాచికత్వానికి ప్రబల ఉదాహరణ. ఇక తాజాగా ప్రభుత్వ విధానాలు సరిగా లేవంటూ నిరసనగలం విప్పిన ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి విషయంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సంచలనగా మారింది.. ఇటీవల ఆయన రాష్ట్రంలో ముందస్తుగానే ఎన్నికలు వస్తాయని, అలా ఎన్నికలు వస్తే తామంతా ఇంటికి వెళ్ళడం ఖాయమని ఆనం వ్యాఖ్యానించారు. దీంతో వెంకటగిరి ఇన్చార్జిగా నేదురుమల్లి రామ్ ను నియమించారు.. సైదాపురం మండలంలో సచివాలయాల నిర్మాణాలు సరిగా జరగడం లేదని, కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదని ఆనం వ్యాఖ్యానించారు. దీంతో జగన్మోహన్ రెడ్డి సైలెంట్ గా ఆనం రామనారాయణ రెడ్డికి షాకిచ్చారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నియోజకవర్గానికి ఇన్చార్జిగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని నియమించారు.. అయితే ఆనం రామనారాయణ రెడ్డి త్వరలో తెలుగు దేశం పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇవి ఇద్దరు ముఖ్యమంత్రులు వ్యక్తిత్వానికి కనిపించే ఉదాహరణలు మాత్రమే.. కనిపించనవి బొచ్చెడు.