కరోనా విపత్తు ఎంత ప్రళయం సృష్టించిందో తెలుసు. రెండో దశలో ప్రజలు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. వైరస్ ధాటికి ప్రపంచమే కుదేలైపోయింది. దీంతో దేశంలోని అనేక రాష్ర్టాలు పరీక్షలను రద్దు చేశాయి. నాలుగైదు రాష్ర్టాలు మాత్రం పరీక్షలు నిర్వహించి తీరుతామని మొండి పట్టుదలతో ముందుకు వెళ్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కరోనా వేళ పరీక్షలు వద్దని వారించినా వినకుండా తమ పంతం నెగ్గించుకోవాలని చూస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ సహా పరీక్షలు రద్దు చేయని రాష్ర్టాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయనుంది. అయితే దీనిపై ఏపీ విద్యాశాఖ మంత్రి కూడా స్పందించారు. పన్నెండో తరగతి పరీక్షల విషయం ఇవాళ సుప్రీంకోర్టులో చర్చకు వచ్చింది. 18 రాష్ర్టాల్లో ఇప్పటికే పరీక్షలు రద్దు చేశారు. ఆరు రాష్ర్టాలలో మొదట్లోనే పరీక్షలు నిర్వహించారు.
నాలుగు రాష్ర్టాలు మాత్రం పరీక్షలు రద్దు చేయకుండా పరీక్షలు నిర్వహించే ఉద్దేశంతో ఉన్నాయి. ఈ నాలుగు రాష్ర్టాలకు పరీక్షల రద్దు విషయంలో నోటీసులు జారీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్, పంజాబ్, త్రిపుర, అసోం రాష్ర్టాలు ఈ జాబితాలో ఉన్నాయి. వీటితో పాటు 11వ తరగతి పరీక్షలు నిర్వహించడానికి ప్రయత్నిస్తున్న కేరళకు కూడా నోటీసులు జారీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 అనుసరించి జీవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని, కరోనా నేపథ్యంలో ఇప్పటివరకు వ్యాక్సినేషన్ కు కూడా నోచుకోని విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం ద్వారా వారి ప్రాణాలను ప్రభుత్వాలు పణంగా పెడుతున్నాయని న్యాయకోవిదులు అభిప్రాయపడుతున్నారు. అయితే సుప్రీంకోర్టు నోటీసుల విషయంపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్, పరీక్షలు ఎంత ముఖ్యమో అన్న విషయాన్ని తాము సుప్రీంకోర్టుకు వివరించే ప్రయత్నం చేస్తామని వ్యాఖ్యానించడం కొసమెరుపు.