BRS- AP: తన అభిమాన నాయకుడు ఎన్టీఆర్ ను కేసీఆర్ ఫాలో అవుతున్నారు. ఏపీలో బీఆర్ఎస్ విస్తరించే పనిలో ఉన్న కేసీఆర్ నాడు టీడీపీ ఆవిర్భావ సమయంలో ఎన్టీఆర్ ఫార్ములాను అనుసరిస్తున్నారు. 1983లో టీడీపీ ఆవిర్భవించగా. 1984లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. అయితే ప్రతీ ఎన్నికలో ఎన్టీఆర్ రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసేవారు. ఆయన తన సొంత నియోజకవర్గం నుంచి బరిలో దిగిన సందర్భాలు చాలా తక్కువ. 295 నియోజకవర్గాలున్న ఉమ్మడి ఏపీలో ఆయన మూడు సార్లు ఎన్నికలు ఫేస్ చేశారు. అయితే ఇలా పోటీచేసిన ప్రతీసారి సక్సెస్ అయ్యారు. ఒక్క 1989 ఎన్నికల్లో మాత్రం ఎన్టీఆర్ రెండు చోట్ల పోటీచేసి ఒక చోటే గెలుపొందారు. అనంతపురం జిల్లా హిందూపురంలో గెలిచారు. మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తిలో ఓటమి చవిచూశారు.

1994 ఎన్నికల్లో అనంతపురం జిల్లా హిందూపురం, శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి ఎన్టీఆర్ పోటీచేశారు. రెండు చోట్ల గెలుపొందారు. తరువాత టెక్కలి అసెంబ్లీ సీటును వదులుకున్నారు. హిందూపురం శాసనసభ్యుడిగా కొనసాగారు. టెక్కలి ఉప ఎన్నికల్లో సీనియర్ నాయకుడు హనుమంతు అప్పయ్యదొరను పోటీచేయించి గెలిపించుకున్నారు. అయితే ఎన్టీఆర్ ఈ ఫార్ములాను అనుసరించడం వెనుక చాలా వ్యూహం ఉంది. వేర్వేరు ప్రాంతాల నుంచి పోటీచేయడంతో ఆ చుట్టుపక్కల ఉన్న పదుల సంఖ్యలో నియోజకవర్గాలపై ఆ ప్రభావం పడుతుంది. ఆ లెక్కనే ఎన్టీఆర్ రెండు చోట్ల పోటీచేసి సక్సెస్ ను చవిచూశారు.

ఇప్పుడు కేసీఆర్ కూడా ఏపీలో బీఆర్ఎస్ తరుపున రెండు చోట్ల బరిలో దిగాలని ప్రయత్నిస్తున్నారు. తన కుల బలం ఎక్కువగా ఉన్న విజయనగరం, శ్రీకాకుళం, కడపలో తాను కానీ.. తన పార్టీ అభ్యర్థులను కానీ రంగంలో దించాలని భావిస్తున్నారు. ఉత్తరాంధ్రలో కుల ప్రభావం ఎక్కువ. అందునా తన సొంత సామాజికవర్గం వెలమలు ఎక్కువ. అందుకే అక్కడ అభ్యర్థులను దించి ఒక చోటనైనా గెలవాలని గట్టి వ్యూహంతో ఉన్నారు. అయితే ఎన్టీఆర్ నాటి పరిస్థితులు లేకున్నా.. తనకు అనుకూలమైన వైసీపీ బ్యాక్ గ్రౌండ్ చూసుకొని సాహసానికి దిగుతున్నట్టు సమాచారం. చూడాలి మరీ ఎన్టీఆర్ లా సక్సెస్ అవుతారా? లేక చతికిలపడతారా?