Delhi Liquor Scam- KCR Family: మొదటి నుంచి ఊహించినట్లుగానే ఢిల్లీ లిక్కస్కాం.. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఇబ్బందిగా మారే అవకాశం కనిపిస్తోంది. సీబీఐ వ్యూహాత్మక దూకుడుతో గులాబీ బాస్ కుటుంబాన్ని, టీఆర్‌ఎస్ పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. బయటకు గాంభీర్యం ప్రదర్శిస్తున్న కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ తమ ప్రసంగాల ద్వారా లోపలి భయాన్ని బయట పెడుతున్నారు. ‘మోడీ.. బోడీ.. ఈడీ నా వెంట్రుక కూడా పీకలేవు’ అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. మరోవైపు సీబీపై విచారణ బోయినపల్లి అభిషేక్‌రావు అరెస్ట్ కేసీఆర్ ఫ్యామిలీకి చేరవైంది.

కొందరి పాత్ర నిగ్గుతేల్చే పనిలో..
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బోయినపల్లి అభిషేక్‌రావుది కీలక పాత్రగా సీబీఐ గుర్తించింది. ఈమేరకు అతడిని అరెస్ట్ చేసిన మూడు రోజుల కస్టడీకి తీసుకుంది. ఈ విచారణలో ఆయన చెప్పే విషయాల ఆధారంగా మరికొందరి పాత్రపై నిగ్గుతేల్చాలని భావిస్తోంది. దీంతో స్కామ్‌లో హస్తం ఉన్నవారి గుండెల్లో సీబీఐ రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఇప్పటికే విజయ్‌నాయర్, సమీర్ మహేంద్రును అరెస్ట్ చేసిన సీబీఐ వాళ్లు ఇచ్చిన సమాచారంతో అభిషేక్‌రావును అరెస్ట్ చేసింది. ఇప్పుడు అభిషేక్ ఇచ్చే సమాచారంతో మరిన్ని అరెస్టులు ఉంటాయని సీబీఐ వర్గాల నుంచి సమాచారం వస్తోంది.
కీలక విషయాలు చెప్పిన అభిషేక్‌రావు..
సీబీఐ ఆశించినట్లుగానే అభిషేక్ విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్లు తెలిసింది. మరోవైపు సీబీఐ కూడా కస్టడీ రిపోర్టులో కీలక విషయాలు పేర్కొంది. అరెస్ట్‌కు ముందు అభిషేక్‌రావును ఎనిమిదిసార్లు పిలిచి ప్రశ్నించిన సీబీఐ.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో ఆయనకు లింకులు ఉన్నట్లు నిర్ధారణకు వచ్చింది. అందుకు సంబంధించిన ఆధారాలు సేకరించింది. సౌత్‌లాబీ పేరుతో.. ఇండో స్పిరిట్ యజమాని విజయ్‌నాయర్, దినేష్ అరోరాతో కలిసి అభిషేక్‌రావు కుట్ర చేసినట్లు సీబీఐ అధికారుల విచారణలో తేలింది. దీనికి సంబంధించి 2021 నవంబర్ నుంచి 2022 జూలై వరకు.. పలు దఫాలుగా వీరు సమావేశమైనట్టు గుర్తించారు. రూ.3.80 కోట్లను అభిషేక్‌రావు మూడు అకౌంట్ల ద్వారా.. షమీర్ మహేంద్రకు హవాలా రూపంలో ట్రాన్స్‌ఫర్ చేసినట్లు గుర్తించారు. వీరికి ఢిల్లీ పెద్దలు డబ్బులు పంపాలన్న ఒత్తిళ్లు వచ్చినట్లు సీబీఐ రిపోర్ట్‌లో తెలిపింది.

కేసీఆర్ కుటుంబీకులకు నోటసులు?
సీబీఐ కస్టడీలో ఉన్న అభిషేక్‌రావు చెప్పిన కీలక విషయాల ఆధారంగా కేసీఆర్ కుటుంబీకులు, అత్యంత సన్నిహితులకు సీబీఐ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వారిని విచారణ చేసిన తర్వాత స్కాంలో మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయన్న ఆలోచనలో సీబీఐ ఉంది. దీంతో అభిషేక్‌రావు అనుమానాస్పద లావాదేవీలు, సమీర్, విజయ్‌నాయర్‌తో సంబంధాలపై సుదీర్ఘంగా సీబీఐ ఆరాతీస్తోంది. విమాన టికెట్లు, హోటల్స్ బుకింగ్‌లకు సంబంధించిన ఆధారాలు అభిషేక్‌రావు ముందు ఉంచి వివరాలు రాబడుతుందని సమాచారం. మూడోరోజు అభిషేక్ స్టేట్‌మెంట్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పూర్తి వివరాలు రాబట్టాక మరికొన్ని అరెస్టులు కూడా ఉంటాయని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి.