BRS : అధికారం ఉన్నప్పుడు ఎగిరి పడకూడదు. అధికారం కోల్పోయినప్పుడు బాధపడకూడదు.. రాజకీయ నాయకులు అనుసరించాల్సిన ప్రాథమిక సూత్రం అది. కానీ దురదృష్టవశాత్తు ఆ సూత్రాన్ని పాటించడంలో చాలామంది విఫలమవుతూ ఉంటారు. అధికారాన్ని కోల్పోయిన తర్వాత కర్మ ఫలాన్ని అనుభవిస్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి పై పరిస్థితినే చవిచూస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆ పార్టీకి అన్ని ప్రతి బంధకాలే ఎదురవుతున్నాయి. అప్పటిదాకా కేసీఆర్ కు వంగి వంగి సలాం చేసిన నేతలంతా పార్టీ మారుతున్నారు. ఏకపక్షంగా భారత రాష్ట్ర సమితి గెలిచిన పురపాలకాలు కాంగ్రెస్ వశమవుతున్నాయి. భారత రాష్ట్ర సమితి పాలనలో అవకతవకలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుత రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వీటిపై తీవ్రంగా దృష్టి సారించింది.
కాళేశ్వరం
అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన అనంతరం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలకమైన మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయాయి. తొలుత దీనిని కవర్ చేసుకోవడానికి భారత రాష్ట్ర సమితి చేయని ప్రయత్నం అంటూ లేదు. ప్రాజెక్టు కింద భూమి కదిలిందని, కొంతమంది కావాలని ఇసుకని తరలించాలని.. ఇలా రకరకాల వ్యక్తీకరణలకు దిగింది. కానీ అంతిమంగా తేలింది “నిర్మాణ లోపం”. ప్రభుత్వ పెద్దల జోక్యం, నిర్మాణ సంస్థ బాధ్యతారాహిత్యం వెరసి తెలంగాణ ప్రజా ధనాన్ని గోదావరిలో పోసినట్టయింది. ఈ ప్రాజెక్టు నిర్మాణలోపంపై ప్రభుత్వం నియమించిన కమిటీ ఇప్పటికే పలు సంచలన విషయాలు వెల్లడించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం అసలు ఈ ప్రాజెక్టు నిర్మాణమే సరికాదని తెలుస్తోంది. మరి దీనిని ప్రస్తుత ప్రభుత్వం ఎలా సవరిస్తుందనేది చూడాలి. మేడిగడ్డలో పగుళ్ళు రాకముందు ఏకంగా డిస్కవరీ ఛానల్ లో పెయిడ్ ప్రోగ్రాం టెలికాస్ట్ చేయించిన భారత రాష్ట్ర సమితి పెద్దలు.. ఎప్పుడైతే పగుళ్లు వచ్చాయో దాని గురించే మర్చిపోయారు. కనీసం ఎన్నికల ప్రచారంలో కాళేశ్వరం మాట కూడా ఎత్తలేదు.
ఢిల్లీ లిక్కర్ స్కాం
ఢిల్లీ మద్యం విధానంలో సౌత్ గ్రూప్ తరపున కీలకంగా వ్యవహరించారని, భారీగా ముడుపులు ఆప్ కు చేరవేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కెసిఆర్ కుమార్తె, భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్టు చేశారు. పది రోజులపాటు విచారించారు. కోర్టు అనుమతితో మరో 14 రోజులపాటు ఆమెను విచారించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు కవిత అరెస్టు భారత రాష్ట్ర సమితికి ప్రతిబంధకంగా మారింది. కవితను బయటికి తీసుకొచ్చేందుకు కేటీఆర్ ఎన్నో ప్రయత్నాలు చేశారు..ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల వద్ద బలమైన ఆధారాలు ఉన్న నేపథ్యంలో.. ఆమెకు బెయిల్ రావడం కష్టంగా మారింది. 14 రోజుల విచారణలో కవిత నుంచి ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఎలాంటి విషయాలు రాబడతారనేది ఆసక్తికరంగా మారింది.
ఫోన్ ట్యాపింగ్
పార్లమెంట్ ఎన్నికల ముందు లిక్కర్ స్కాం వల్ల భారత రాష్ట్ర సమితి ఇబ్బంది పడుతుంటే.. దానిని మర్చిపోకముందే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరపైకి వచ్చింది. భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకొని ఫోన్ ట్యాపింగ్ చేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న పోలీసుల అదుపులో ఉన్నారు. భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మొదలుకొని పలువురు ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ ఎమ్మెల్సీ ట్యాప్ పరికరాలను ఇజ్రాయిల్ దేశం నుంచి కొనుగోలు చేశారని.. అప్పట్లో ఓ మంత్రి తన నియోజకవర్గం లోని ఓ గ్రామంలో వార్ రూమ్ ఏర్పాటు చేశారని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో అప్పటి ప్రభుత్వ పెద్దలు కొంతమందికి కీలకంగా వ్యవహరించారని సమాచారం. ఇప్పటికే ఈ వ్యవహారంపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కీలక ఆరోపణలు చేశారు.. ప్రభుత్వం వెంటనే నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
భూకబ్జాలు, కార్పొరేటర్ల అరెస్టులు
భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు కరీంనగర్ ప్రాంతంలో భూకబ్జాలు ఇష్టానుసారంగా చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రాంతానికి చెందిన ఓ మంత్రి అనుచరులు అడ్డగోలుగా ఆక్రమణలకు పాల్పడ్డారని ఇటీవల ముఖ్యమంత్రికి ఫిర్యాదులు వెళ్లాయి. వాటి ఆధారంగా రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తే అసలు వాస్తవాలు కళ్లకు కట్టాయి. వాటిపై రెవెన్యూ అధికారులు విచారణ సాగిస్తున్నారు.. భూ కబ్జాల వ్యవహారంలో ఇప్పటికే పోలీసులు కొంతమంది కార్పొరేటర్లను అరెస్టు చేశారు.
45 రోజులే గడువు
పార్లమెంటు ఎన్నికలకు సరిగ్గా 45 రోజులే గడువు ఉన్న నేపథ్యంలో వరుస ప్రతిబంధకాలు భారత రాష్ట్ర సమితిని ఇబ్బందికి గురిచేస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడే 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి 9 స్థానాలు గెలుచుకుంది. అప్పట్లో కారు సారు 16 అనే నినాదాన్ని తెరపైకి తెచ్చింది. అధికారంలో ఉన్నప్పుడే 9 స్థానాలతో సరిపెట్టుకుంది. పైగా కేసీఆర్ కూతురు నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో ఓడిపోయింది. ఇలాంటప్పుడు ఈసారి ఎన్నికల్లో ఎంతవరకు భారత రాష్ట్ర సమితి సత్తా చాటుతుందనేది ఆసక్తికరంగా మారింది.
ఇంకా కోలుకోలేదు
కేసీఆర్ ఇంకా అనారోగ్యం నుంచి కోలుకోలేదు. ఇటీవల నల్లగొండ, కరీంనగర్ సభల్లో ఆయన ధాటిగా విమర్శలు చేసినప్పటికీ కేడర్ లో ఇంకా నమ్మకం కలగడం లేదు. నేతల వలసలు ఆగడం లేదు. కీలకమైన ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నారు. చివరికి కేసీఆర్ కు అత్యంత దగ్గర ఇస్త స్నేహితుడు మదన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారంటే భారత రాష్ట్ర సమితి పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇక కేటీఆర్ మునుపాటి లాగా మాట్లాడటం లేదు. అధికారం పోయిందనే అసహనం ఆయనలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. చివరికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కూడా ఆయన సాధారణ విషయంగా కొట్టిపారేస్తున్నారు. అంటే అధికారంలో ఉన్నవాళ్లు ప్రతిపక్ష నాయకుల ఫోన్లు వినవచ్చు అని ఒప్పుకుంటున్నారు. అలాంటి రాజకీయాలను ఎలా పరిగణిస్తారో ఆయనకే తెలియాలి. ఇన్ని ప్రతిబంధకాల మధ్య భారత రాష్ట్ర సమితి.. పార్లమెంటు ఎన్నికల్లో ఎలా నెగ్గుకొస్తుందోనని కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది.