IPL 2024 SRH vs MI : ముంబైపై విరుచుకుపడ్డ హైదరాబాద్ ఆటగాళ్లు.. ఐపీఎల్ లోనే భారీ స్కోరు

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై జట్టు.. ఆ నిర్ణయం ఎంత తప్పో తర్వాత గాని అర్థం కాలేదు. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (11), ట్రావిస్(62) హెడ్ తొలి వికెట్ కు 4.1 ఓవర్లలో 45 పరుగులు జోడించారు.

Written By: Anabothula Bhaskar, Updated On : March 27, 2024 9:55 pm

IPL 2024 SRH vs MI Abhishek sharma

Follow us on

IPL 2024 SRH vs MI:  ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ మైదానంలో ముంబై జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు భారీ స్కోరు దిశగా పరుగులు తీస్తోంది. ఇప్పటికే ఆ జట్టు స్కోరు 200 పరుగులు దాటింది. ఇన్నింగ్స్ ముగిసేసరికి హైదరాబాద్ జట్టు 250+ స్కోర్ సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి. ముంబై జట్టులో బుమ్రా మినహా మిగతా బౌలర్లు పెద్దగా రాణించలేదు. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా సైతం ధారాళంగా పరుగులు ఇచ్చాడు. హైదరాబాద్ బ్యాటర్లలో హెడ్, అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై జట్టు.. ఆ నిర్ణయం ఎంత తప్పో తర్వాత గాని అర్థం కాలేదు. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (11), ట్రావిస్(62) హెడ్ తొలి వికెట్ కు 4.1 ఓవర్లలో 45 పరుగులు జోడించారు. అగర్వాల్ అవుట్ అయిన తర్వాత క్రీజ్ లోకి అభిషేక్ శర్మ (62) వచ్చాడు. హెడ్, అభిషేక్ శర్మ వీరోచితమైన బ్యాటింగ్ చేశారు. రెండో వికెట్ కు వీరు మూడు ఓవర్లలో 68 పరుగులు జోడించడం విశేషం. దీంతో హైదరాబాద్ స్కోర్ రాకెట్ లాగా దూసుకెళ్లింది. క్వెనా మహాపాక, హార్దిక్ పాండ్యా, కొయేట్జీ, పీయూష్ చావ్లా, ములానీ… ఇలా అగ్రశ్రేణి బౌలర్లు మొత్తం దారుణంగా పరుగులు ఇచ్చారు.. వీరిలో ఒక్క బుమ్రా మాత్రమే తక్కువ పరుగులు ఇచ్చాడు.

రికార్డు స్థాయిలో..

వన్ డౌన్ బ్యాటర్ క్రీజ్ లోకి వచ్చిన అభిషేక్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.. హైదరాబాద్ జట్టు తరఫున తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా అభిషేక్ శర్మ రికార్డు సృష్టించాడు. అభిషేక్ శర్మ లాగానే హెడ్ కూడా దూకుడుగా బ్యాటింగ్ చేశాడు.. హెడ్ 24 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్ ల సహాయంతో 62 పరుగులు చేశాడు. కొయేట్జీ బౌలింగ్లో నామన్ దార్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. అభిషేక్ శర్మ 23 బంతుల్లో మూడు ఫోర్లు, ఏడు సిక్స్ ల సహాయంతో 63 పరుగులు చేశాడు. ఒకానొక దశలో అతడు సెంచరీ సాధిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ పీయూష్ చావ్లా బౌలింగ్ లో అభిషేక్ శర్మ నామన్ దార్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. వీరిద్దరూ ఔట్ అయిన తర్వాత మార్క్రమ్(35), క్లాసెన్(30) ధాటిగా బ్యాటింగ్ చేయడంతో హైదరాబాద్ స్కోర్ 16 ఓవర్లకే 216 పరుగులకు చేరుకుంది. మొత్తానికి సొంత గడ్డపై హైదరాబాద్ జట్టు ధాటిగా బ్యాటింగ్ చేయడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా హైదరాబాద్ ఆటగాళ్లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.