https://oktelugu.com/

CM KCR: కెసిఆర్ పై బీఆర్ఎస్ కార్యకర్తల ధిక్కారం

భారత రాష్ట్ర సమితి అభ్యర్థులను ముందుగానే కెసిఆర్ ప్రకటించినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా సానుకూల వాతావరణం కనిపించడం లేదు..కొన్ని నియోజకవర్గాల్లో అయితే కార్యకర్తలు నేరుగా అధిష్టానాన్ని విమర్శిస్తున్నారు.

Written By: , Updated On : September 2, 2023 / 01:53 PM IST
CM KCR

CM KCR

Follow us on

CM KCR: దాదాపు పది రోజులు కావస్తోంది. అసమ్మతి చల్లారడం లేదు. అసంతృప్తులు తమ నిరసనను ఆపడం లేదు. అంతకంతకు గొంతును సవరించుకుంటున్నారు. ఏకంగా కెసిఆర్ నిర్ణయాన్నే తప్పు పడుతున్నారు. బలవంతంగా మా మీదకు ఇంకా ఎన్ని రోజులు రుద్దుతారంటూ ప్రశ్నిస్తున్నారు. అధిష్టానం పునరాలోచన చేయకపోతే తాము కెసిఆర్ ప్రకటించిన అభ్యర్థుల ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని వారు తెగేసి చెబుతున్నారు.
భారత రాష్ట్ర సమితి అసెంబ్లీ అభ్యర్థులను కెసిఆర్ ప్రకటించిన నాటి నుంచి ఇదే పరిస్థితి రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో కొనసాగుతోంది. క్రమశిక్షణకు మారుపేరైన భారత రాష్ట్ర సమితిలో ఇలాంటి పరిణామాన్ని ఊహించలేదని ఆ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. మరోవైపు ఎన్నికల సమయంలో ఇలాంటి నిరసనలు సర్వసాధారణమని మరికొందరు కొట్టేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ తన రాజకీయ చతురతతో ప్రతిపక్ష పార్టీలను ముప్పు తిప్పలు పెట్టే కేసీఆర్.. సొంత పార్టీ కార్యకర్తల నుంచి ఇలాంటి నిరసనను ఎదుర్కోవాల్సి రావడం ఒకింత ఆశ్చర్యకరమే.

ఓడిస్తాం

భారత రాష్ట్ర సమితి అభ్యర్థులను ముందుగానే కెసిఆర్ ప్రకటించినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా సానుకూల వాతావరణం కనిపించడం లేదు..కొన్ని నియోజకవర్గాల్లో అయితే కార్యకర్తలు నేరుగా అధిష్టానాన్ని విమర్శిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అబ్రహానికి వ్యతిరేకంగా భారత రాష్ట్ర సమితిలోని వర్గం నాయకులు సమావేశమయ్యారు. తమను ఏనాడూ పట్టించుకోని అబ్రహానికి టికెట్ ఎలా ఇస్తారంటూ ఆ నాయకులు ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పెద్దగా పాటుపడని వ్యక్తికి టికెట్ ఇస్తే ఎలా గెలిపిస్తామని వారు ప్రశ్నిస్తున్నారు. అధిష్టానం అబ్రహం విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకొని పక్షంలో తాము కచ్చితంగా ఆయనను ఓడించి తీరుతామని వారు చెబుతున్నారు. ఇక ఇదే తీరుగా వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కుమార్ పరిస్థితి ఉంది. మెతుకు ఆనంద్ కుమార్ తమ గురించి ఎన్నడూ ఆలోచించలేదని, అలాంటి వ్యక్తికి తాము ఎలా ఓటేస్తామంటూ భారత రాష్ట్ర సమితిలోని కొందరు కార్యకర్తలు నిరసనగలం వినిపిస్తున్నారు. ఆనంద్ కుమార్ కు వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ప్రదర్శన కూడా నిర్వహించారు. తమను పట్టించుకోకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే అగ్ర తాంబూలం ఇస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై నేరుగా ముఖ్యమంత్రి కలవాలని వారు ఒక నిర్ణయానికి వచ్చారు.

మిగతా చోట్ల కూడా..

కేవలం అలంపూర్, వికారాబాద్ మాత్రమే కాకుండా రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో కెసిఆర్ ప్రకటించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా సొంత పార్టీ కార్యకర్తలు నిరసనగలం వినిపిస్తున్నారు. మహబూబాద్ ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ రవీందర్రావు అనుచరులు ఇప్పటికీ సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. తన అనుచరుల జోలికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇటీవల ఎమ్మెల్సీ రవీందర్రావు హెచ్చరించడం కలకలం రేపింది. ఇక జనగామ టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి కేటాయిస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వర్గం వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజేశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారు. ఇక స్టేషన్ ఘన్పూర్ స్థానాన్ని కడియం శ్రీహరికి అప్పగించడంతో.. అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇటీవల ఆయనతో మాట్లాడేందుకు వెళ్లిన పల్లా రాజేశ్వర్ రెడ్డికీ నిరసన ఎదురైంది. కేవలం వీరు మాత్రమే కాకుండా సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్ లోనూ బీసీల నుంచి భారత రాష్ట్ర సమితికి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అయితే ఇది చినికి చినికి గాలి వానలాగా కాకముందే కేసీఆర్ నష్ట నివారణ చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు అంటున్నారు. ఈ ప్రకారం చూసుకుంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఒకవేళ మార్చితే తదుపరి పరిస్థితులు ఎలా ఉంటాయి అనేదానిపై కూడా ముఖ్యమంత్రి చర్చిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది.