Minister Rajini OSD
Minister Rajini OSD: రాష్ట్రంలో కొంతమంది అధికారులు తీరు వివాదాస్పదమవుతోంది. తాజాగా మధుసూదన్ రెడ్డి అనే అధికారి దిగువ స్థాయి సిబ్బందిపై చేయి చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఈయన మంత్రి విడుదల రజిని ఓఎస్డిగా పనిచేస్తున్నారు. దీంతో దిగువ స్థాయి ఉద్యోగులు నిరసనకు దిగడంతో పావుగంట పాటు అత్యవసర సేవలకు భంగం వాటిల్లింది. రాష్ట్ర ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ ఘటనతో మంత్రి రజిని ఇరుకున పడాల్సి వచ్చింది.
అన్నమయ్య జిల్లాలో 108 అంబులెన్స్ రాకలో జాప్యం జరిగింది. ఈ కారణంగా రైలు ప్రమాద బాధితుడు ఒకరు మరణించినట్లు మీడియాలో వార్త వచ్చింది. దీనిపై సీఎంఓ 108 కాల్ సెంటర్ ను వివరణ అడిగింది. దీనిపై హడావిడి చేసిన మంత్రి ఓ ఎస్ డి మధుసూదన్ రెడ్డి 108 కాల్ సెంటర్ లోని ఉద్యోగి వద్దకు వచ్చి ప్రశ్నించారు. సదరు ఉద్యోగి వివరణ ఇస్తుండగానే ఓఎస్ డి ఆగ్రహానికి గురై ఆయన చెంపను చెల్లుమనిపించారు. హటాత్ పరిణామంతో అక్కడ ఉన్న ఉద్యోగులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఆందోళనకు దిగారు.
బాధిత ఉద్యోగికి.. తోటి ఉద్యోగులు బాసటగా నిలిచారు. దాదాపు పావుగంట పాటు కాల్ సెంటర్ కు వచ్చిన కాల్స్ ని తీసుకోలేదు. దీంతో అధికారులు ఒక్కసారిగా హైరానా పడిపోయారు. ఉద్యోగులను బుజ్జగించడంతో వెనక్కి తగ్గారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ ఘటనపై మధుసూదన్ రెడ్డికి మేమో ఇవ్వాలని ఆరోగ్యశ్రీ సీఈఓ ను ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారే కాల్ సెంటర్కు ఫోన్ చేస్తారని….అటువంటి సమయంలో ఉద్యోగులు బాధ్యతారాహిత్యం గా ఉండడంతోనే తాను ఆవేదన గురైనట్లు ఓ ఎస్ డి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.