Dalit Bandhu: హుజూరాబాద్ ఉప ఎన్నికకు టార్గెట్ చేస్తూ పుట్టికొచ్చిన పథకం ‘దళితబంధు’. ఈ నియోజకవర్గంలో దళితుల ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టే ఉద్దేశ్యంతో కేసీఆర్ మాస్టర్ మైండ్ నుంచి ‘దళితబంధు’ పథకం ఆవిర్భవించిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉప ఎన్నికల ముందు ఈ పథకంపై టీఆర్ఎస్ నాయకులు దుమ్మురేపేలా ప్రచారం చేశారు.
అర్హులైన దళితులందరికీ 10లక్షల చొప్పుల ఆర్థికసాయం అందించనున్నట్లు చెప్పారు. హుజూరాబాద్ నియోజకవర్గాన్ని దళితబంధు పైలట్ ప్రాజెక్టుగా ప్రకటించి నాలుగు మండలాల్లో పథకం అమలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎన్నికల ముందు కొంతమంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారి ఖాతాల్లో 10లక్షల డబ్బును ప్రభుత్వం జమ చేసింది.
Also Read: కాంగ్రెస్ పార్టీ గెలిచే సీట్లపై రేవంత్ కొత్త లెక్కలు..
దళితబంధు పథకం ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని బీజేపీ నేతలు నాడు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లడంతో ఈ పథకానికి ఈసీ బ్రేక్ వేసింది. ఈక్రమంలోనే ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో వేసిన డబ్బును ఫ్రీజ్ చేసింది. ఎన్నికల తర్వాత ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొంది.
తీరా ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఓటమి పాలయ్యారు. ఈటల రాజేందర్ హుజూరాబాద్ గతంలో కంటే ఎక్కువ ఓట్లతో గెలిచారు. ఇక నాటి నుంచి దళితబంధు పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వం దళితబంధును అమలు చేస్తామని చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం సాధ్యపడటం లేదు.
కరోనాతో ప్రభుత్వానికి ఆదాయం తగ్గడంతో నిధుల సమస్య ఏర్పడుతోంది. ఈ పథకానికి భారీ మొత్తంలో నిధులు కావాల్సి ఉండటంతో దీనిని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం తటపటాయిస్తోంది. మరోవైపు ప్రతిపక్షాలు దళితబంధును అమలు చేయాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. సీఎం కేసీఆర్ చెప్పిన ప్రకారంగా అయితే మార్చి కల్లా హూజూరాబాద్లోని నాలుగు మండలాల్లో దళిత బంధు పథకం పూర్తి కావాలి.
వచ్చే మార్చి నాటికి ఒక్కో నియోజకవర్గంలో 100మంది దళితులకు ఈ పథకాన్ని అమలు చేయాలి. కానీ ఇప్పటి వరకు హూజూరాబాద్లోనే లక్ష్యంగా పూర్తి కాలేదు. దీంతో ఈ పథకం ఎన్నికల స్టంట్ గా మిగిలిపోతుందా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. నిజంగా అలా జరిగే ప్రభుత్వంవిశ్వసనీయత డ్యామేజ్ కానుంది.దీంతో నిధులు సర్దుబాటు చేసుకొని జనవరిలో ఈ పథకాన్ని మళ్లీ షూరు చేయనున్నారనే టాక్ విన్పిస్తోంది.
మొత్తానికి దళిత బంధు పథకం ఒక అడుగు ముందుకు పడితే పది అడుగులు వెనుకకు అనేలా సాగుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో గులాబీ బాస్ దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
Also Read: జగ్గారెడ్డి లేఖపై అధిష్టానం స్పందిస్తుందా?