NTR-Charan: ఇద్దరు స్టార్ హీరోల మధ్య బాండింగ్ ఆసక్తిరేపే అంశం. భారీ ఫ్యాన్ బేస్ కలిగిన ఇద్దరు హీరోలు ఒకే వేదికపై కనిపించడాన్ని ఫ్యాన్స్ విశేషంగా చెప్పుకుంటారు. తమ హీరో గురించి మరో స్టార్ ఎలాంటి కామెంట్స్ చేస్తారోనన్న ఆత్రుత కనబరుస్తారు. అదే సమయంలో ఎవరు ఎక్కువ? ఎవరు తక్కువ? అనే క్యాలిక్యులేషన్స్ కూడా మొదలుపెడతారు. కాగా ఆర్ ఆర్ ఆర్ పుణ్యమా అని ఇద్దరు టాప్ స్టార్స్ ని ఏకం చేశాడు రాజమౌళి. టాలీవుడ్ లో నందమూరి-మెగా కుటుంబాలు సినిమా పరంగా ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నారు. వీరి మధ్య మూడు దశాబ్దాలకు పైగా ఫ్యాన్ వార్ నడుస్తోంది. అలాంటి ఫ్యామిలీల నుండి ఇద్దరు హీరోలను ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం ఎంచుకోవడంలోనే రాజమౌళి సగం విజయం సాధించారు.

ఎప్పుడో ఎన్టీఆర్ సినిమాల్లో చిరంజీవి కీలక రోల్స్ చేశారు. చిరంజీవి స్టార్ గా ఎదిగాక… ఎన్టీఆర్ తో చిత్రాలు చేయలేదు. మరోవైపు స్టార్ హోదా దక్కించుకున్న బాలయ్యతో కూడా ఆయన మల్టీస్టారర్ చేయలేదు. మరి ఇన్నేళ్ల తర్వాత ఇరు కుటుంబాల హీరోలు కలిసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ చాలా ప్రత్యేకం. ఈ విషయంలో దర్శకుడు రాజమౌళి పై చాలా ఒత్తిడి ఉంది. క్యారెక్టరైజేషన్ నుండి సాంగ్స్, యాక్షన్ సన్నివేశాలు.. ఇలా ప్రతి విషయంలో కంపారిజేషన్ ఉంటుంది. ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనే పరిశీలన ఉంటుంది. ఏ ఒక్కరి హీరో ఇసుమంత తక్కువ అయినా.. ఫ్యాన్స్ ఊరుకోరు.
దీని కోసం రాజమౌళి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఇద్దరు హీరోలకు సమానమైన ప్రాధాన్యత, సన్నివేశాలు ఉండేలా ఆర్ఆర్ఆర్ తెరకెక్కించారు. ఎంతో కొంత మేర ఒకరి వైపు మొగ్గు అయితే ఉంటుంది. కాగా ఆర్ఆర్ఆర్ ప్రమోషనల్ ఈవెంట్స్ లో రామ్ చరణ్ వ్యాఖ్యలు ఆసక్తిరేపుతున్నాయి. ఆయన ఎన్టీఆర్ విషయంలో చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఎన్టీఆర్ పేరు పలికిన ప్రతిసారి రామ్ చరణ్ కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి.
Also Read: ఎన్టీఆర్, చరణ్ లలో గొప్ప గుణాల సీక్రెట్స్ చెప్పిన రాజమౌళి
ఎన్టీఆర్ నా బ్రదర్, నాలో సగం అని అన్నారు. నా ప్రాణం ఉన్నంత వరకు ఎన్టీఆర్ ని వీడేది లేదని, ఇలాంటి మల్టీస్టారర్స్ చాలా చేస్తామంటున్నారు. ఎన్టీఆర్ సైతం రామ్ చరణ్ గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. అయితే రామ్ చరణ్ లో ఆ ఇంటెన్సిటీ తీవ్ర స్థాయిలో ఉంటుంది. మెగా హీరోల గురించి కూడా రామ్ చరణ్ ఇంత ఎమోషనల్ గా మాట్లాడిన సందర్భాలు లేవు.
ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ దాదాపు మూడేళ్లు కలిసి ప్రయాణం చేశారు. ఈ ప్రయాణంలో ఎన్టీఆర్ చరణ్ కి బాగా కనెక్ట్ అయ్యారని అనిపిస్తుంది. ఎన్టీఆర్ తో నటించడం కోసం సెట్స్ లో ఎక్కువ టేక్స్ తీసుకోవాలనిపించేదని రామ్ చరణ్ అనడం నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఈ 200 రోజుల షూటింగ్ లో చరణ్ కి ఎన్టీఆర్ అంతలా కనెక్ట్ కావడానికి ఏమి చేశారు? ఎన్టీఆర్ చరణ్ పై ఎంత ప్రేమ కురిపించారు? అనే ఉత్సుకత రేగుతుంది. కారణం ఏదైనా ఇద్దరు హీరోల మధ్య ఇలాంటి బాండింగ్ ఆరోగ్యకరమైన పోటీ కి తార్కాణం. మిగతా స్టార్స్ సైతం వీరిని అనుసరిస్తే.. పరిశ్రమలో అనారోగ్యకరమైన వాతావరణం, ఫ్యాన్ వార్స్ నియంత్రించవచ్చు.