
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద కరోనా మందుకు బ్రేక్ వేసింది ఏపీ సర్కార్. అర్ధరాత్రి ఆనందయ్య ఇంటికి చేరుకున్న పోలీసులు మందు పంపిణీ కేంద్రాన్ని ఖాళీ చేయించి.. మందు తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ్టి నుంచి ప్రభుత్వం అనుమతి వచ్చే వరకు మందు పంపిణీ లేదని పోలీసులు ఆనందయ్యకు స్పష్టం చేశారు. మందుకోసం ఎవరూ రావద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా పోలీసులు ఆనందయ్యకు అదనపు భద్రత కల్పించారు. ఆనందయ్య మందుపై ఆయూష్ కమిషనర్ రాములు ఆధ్వర్యంలో ప్రస్తుతం అధ్యయనం జరుగుతోందని.. ఐసీఎంఆర్ టీంతో కలిసి లోతుగా అధ్యయనం చేస్తున్నారు.
ఏపీ సీఎం జగన్ సూచనలతో ఐసీఎంఆర్ బృందం నిన్ననే నెల్లూరు జిల్లా కృష్ణపట్నం చేరుకొని ఆనందయ్య కరోనా ఆయుర్వేద మందు తయారు చేసే వివిధ చెట్ల ఆకులు, పదార్థాలను పరిశీలించారు. తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. దీనిపై పరిశోధన చేసి నిజం అని తేలాకే ఈ మందును పంపిణీ చేయాలని ఏపీ సర్కార్ డిసైడ్ అయ్యింది.
ఆనందయ్య కరోనా ఆయుర్వేద మందు ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. నిన్న 60వేల మంది రావడంతో పోలీసులు మందు పంపిణీని నిలిపివేశారు. సీఎం జగన్ దీనిపై పరిశోధన జరిపిస్తున్నారు. ఆ ఫలితాలు వచ్చాకే మందు పంపిణీ చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. అప్పటిదాకా ఈ మందు పంపిణీ నిలిపివేయనున్నారు.