Botsa Satyanarayana: చీపురుపల్లి నుంచి బొత్స షిఫ్ట్?

బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీ లక్ష్మిని విశాఖ పార్లమెంట్ స్థానం అభ్యర్థిగా జగన్ ప్రకటించారు. ఆమె గట్టి అభ్యర్థి అవుతారని జగన్ భావించారు.

Written By: Dharma, Updated On : February 21, 2024 11:28 am
Follow us on

Botsa Satyanarayana: సీనియర్ మంత్రి బొత్స షిఫ్ట్ అవుతున్నారా? ఈసారి ఆయన చీపురుపల్లి నుంచి పోటీ చేయడం లేదా? ఆయనకు స్థానచలనం తప్పదా? జగన్ ఆదేశాలు పాటించాల్సిందేనా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. చాలా ఏళ్లుగా బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.2004,2009 ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి బొత్స గెలుపొందారు.2014లో మాత్రం ఓడిపోయారు.కానీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గణనీయమైన ఓట్లు సాధించారు.వైసిపికి అధిగమించి రెండో ప్లేస్ లో ఉన్నారు. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో డిపాజిట్లు సాధించుకున్న ఏకైక అభ్యర్థి కూడా ఆయనే కావడం గమనార్హం. అటువంటి బొత్సను చీపురుపల్లి నుంచి జగన్ తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది.

బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీ లక్ష్మిని విశాఖ పార్లమెంట్ స్థానం అభ్యర్థిగా జగన్ ప్రకటించారు. ఆమె గట్టి అభ్యర్థి అవుతారని జగన్ భావించారు. మరోవైపు విజయనగరం పార్లమెంట్ స్థానానికి బొత్స సత్యనారాయణ పోటీలోకి దిగుతారని టాక్ నడిచింది. కానీ ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది. బొత్స సత్యనారాయణ విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. చీపురుపల్లి నుంచి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాస్ రావు బరిలో దిగితే ఫలితం ఉంటుందని.. బొత్సపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉందని.. సర్వేల్లో యువకుడైన టిడిపి అభ్యర్థి కిమిడి నాగార్జున వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని జగన్ కు నివేదికలు అందాయి. దీంతో బొత్స నియోజకవర్గ మార్పు అనివార్యంగా మారినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం భీమిలి నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు పోటీకి సిద్ధపడుతున్నారు. అక్కడ టిడిపి అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది. మరోవైపు జనసేనకు టికెట్ కేటాయిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నడుమ కొత్తగా వైసీపీ అభ్యర్థిగా బొత్స శ్రీనివాస్ రావు పేరు వినిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. విశాఖ పార్లమెంట్ స్థానం పరిధిలోని భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. ఇక్కడ కాపు సామాజిక వర్గం అధికం. భీమిలి నుంచి బొత్స బరిలో దిగితే.. పార్లమెంట్ స్థానం సైతం సునాయాసంగా దక్కించుకోవచ్చు అని జగన్ భావిస్తున్నారు. అందుకే ఈ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అదే జరిగితే ముత్తంశెట్టి శ్రీనివాసరావు పరిస్థితి ఏమిటి? ఆయన సహకరిస్తారా? లేకుంటే గౌరవంగా తప్పుకుని బొత్సకు అవకాశం ఇస్తారా? లేకుంటే ఆయనకు వేరే ఛాన్స్ జగన్ ఇస్తారా? అన్నది చూడాలి. మొత్తానికైతే భీమిలి సీటు విషయంలో బొత్స పేరు పరిశీలనలో ఉన్న మాట వాస్తవమని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.