Yashasvi Jaiswal: రాజ్ కోట్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో 434 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయం భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్దది. ఈ విజయం వెనక ముఖ్య పాత్ర పోషించింది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 23 సంవత్సరాల క్రికెటర్ యశస్వి జైస్వాల్. మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో అతడు సాధించిన డబుల్ సెంచరీ ఆ మ్యాచ్ కే హైలెట్ గా నిలిచింది. మ్యాచ్ ముగిసి నాలుగు రోజులు అవుతున్నప్పటికీ యశస్వి చేసిన సెంచరీ గురించే చర్చ జరుగుతున్నది. ప్రస్తుత సోషల్ మీడియా కాలంలో యశస్వి గురించి రోజుకో కొత్త అంశం వెలుగు చూస్తోంది.
యశస్వి జైస్వాల్ డిసెంబర్ 28, 2001 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాదోహి ప్రాంతంలోని సూర్యా వాన్ అనే గ్రామంలో జన్మించాడు. చాలా చిన్న వయసు నుంచే యశస్వి తన క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించాడు. క్రికెట్లో మెలకువలు నేర్చుకునేందుకు ముంబై వెళ్ళాడు. ముంబై వెళ్ళినప్పుడు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. ఓ పాల వ్యాపారి వద్ద పనిచేసేవాడు. అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడడంతో ఆజాద్ మైదాన్ లోని గ్రౌండ్స్ మెన్ తో కలిసి వనోపాధి కోసం పానీపూరి విక్రయించేవాడు. ఇలా అతని ప్రతిభను ముంబై కోచ్ జ్వాలా సింగ్ గుర్తించారు. అలా అతడు అండర్ 19 లో ఇండియా జట్టులో స్థానం సంపాదించగలిగాడు. అండర్ 19 లో ఆకట్టుకునే ప్రదర్శన చేయడం ద్వారా ఐపీఎల్ ఫ్రాంచైజీ జట్టు రాజస్థాన్ రాయల్స్ ను ఆకట్టుకున్నాడు. 2020 వేలంలో అతడు 2.4 కోట్లకు అమ్ముడుపోయాడు. 2022లో 4 కోట్లు చెల్లించి అదే రాజస్థాన్ రాయల్స్ జట్టు కొనుగోలు చేసింది. 2023లో కోల్ కతా నైట్ రైడర్స్ పై జైస్వాల్ కేవలం 13 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేశాడు. కేఎల్ రాహుల్, పాట్ కమిన్స్ రికార్డు అధిగమించాడు. ఆ అర్థ సెంచరీ అతడి కెరీర్ నే మార్చేసింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐపిఎల్ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేయకపోయినప్పటికీ.. జై స్వాల్ మాత్రం ఎప్పటికప్పుడు తన బెస్ట్ ఇస్తూనే ఉన్నాడు.
ప్రస్తుతం యశస్వి జైస్వాల్ నికర ఆస్తుల విలువ 10.73 కోట్లు. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో ఒప్పందం కాకుండా.. బీసీసీఐ, బ్రాండ్ అండార్స్ మెంట్ల ద్వారా అతడు ప్రతి నెలా 35 లక్షలు సంపాదిస్తున్నాడు. సంపాదన పెరగడంతో యశస్వి జైస్వాల్ 2023లో ముంబైలోని థానే ప్రాంతంలో 5 BHK అపార్ట్మెంట్లో ఇల్లు కొనుగోలు చేశాడు. తద్వారా ముంబైలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నాడు. 1500 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న అతడి ఇంటిని మెకాసా స్టూడియో మినిమలిస్టిక్ అనే సంస్థ అధునాతనంగా రూపొందించింది. అతని ఇంటికి సంబంధించిన ఇంటీరియర్ విషయంలో యూరోపియన్ సంస్కృతి ప్రతిబింబించేలా రూపొందించింది.
ముంబై మహానగరంలో ఖరీదైన ఇల్లు మాత్రమే కాకుండా మెర్సి డేజ్ SUV అనే వాహనాన్ని కొనుగోలు చేశాడు. ఈ విలాసవంతమైన కారులో తన కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు వెళుతుంటాడు. స్నేహితులతో కలిసి పలు ప్రాంతాలను సందర్శిస్తుంటాడు. “నేను ముంబై మహానగరంలో ఇల్లు కొనాలి అనుకున్నాను. నా ఆట ద్వారా అనేక అవకాశాలు సంపాదించుకొని.. అలా వచ్చిన డబ్బుతో ఇల్లు కొనుగోలు చేశాను. నా తల్లిదండ్రులు, తోబుట్టువులతో కలిసి నివసించడానికి అనువుగా ఈ ఇల్లు కొనుగోలు చేశాను. నాకు పెద్దగా కోరికలు లేవు. ప్రస్తుతం నా దృష్టి మొత్తం ఆట మీదేనని” జైస్వాల్ పేర్కొన్నాడు. ఎక్కడో ఉత్తరప్రదేశ్ నుంచి మొదలైన అతని ప్రయాణం ముంబై రాగానే మరో టర్న్ తీసుకుంది. పాల ప్యాకెట్లు విక్రయించే డీలర్ వద్ద పనిచేశాడు. పానీ పూరి అమ్మాడు. రోడ్ల మీద పడుకున్నాడు. అయినప్పటికీ ఆట మీద తన మమకారాన్ని చంపుకోలేదు. ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ తన ఆటలో మరింత నైపుణ్యం సంపాదించాడు. అలా ఈ స్థాయికి ఎదిగాడు. నేడు టీమిండియా యువ సంచలనంగా మారిపోయాడు. అందుకే అంటారు కష్టేఫలి అని..