అమ్మా బైలెల్లినాదో అంటూ హైదరాబాద్ అంతటా ఈరోజు బోనాల పండుగ వైభవంగా జరిగింది. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న పాతబస్తీ లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకలు కన్నుల పండువగా సాగుతున్నాయి. అమ్మవారికి ఎంతో ప్రతీకరమైన ఆదివారం బోనాలు సమర్పించేందుకు భక్తులు పోటెత్తారు.
గత ఏడాది కరోనా కారణంగా ఇళ్లకే పరిమితమైన భక్తులు ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తివేతతో సందడి చేశారు. తమ ఇష్ట దైవం కోసం బోనమెత్తారు. భారీగా ఆలయాలకు చేరుకొని బోనం సమర్పించారు. వేడుకల్లో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ తొలి బోనం సమర్పించారు.
ప్రభుత్వం తరుఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారిని మంత్రి మహమూబ్ అలీ దర్శించుకున్నారు.
భక్తుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తిశ్రద్ధలతో బోనం సమర్పించుకుంటున్నారని.. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఏకంగా 3వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
బోనాల సందర్భంగా పలు చోట్ల ట్రాఫిక్ మళ్లించారు. సోమవారం లాల్ దర్వాజ సింహవాహిని ఆలయంలో రంగంతోపాటు అంబారీ ఊరేగింపు కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు.