BL Santhosh Warning: ‘నా దారిన నేను పార్టీ పనులు చేసుకుంటున్నా.. అనవసంగా నన్ను ఎమ్మెల్యేల కొనుగోలు కేసులోకి లాగారు. నా పేరు తెలియని తెలంగాణకు నన్ను పరిచయం చేశారు. దీని పర్యవసానాలు అనుభవించక తప్పదు’ తెలంగాణ సర్కార్‌ను ఉద్దేశించి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎస్.సంతోష్ చేసిన హెచ్చరిక ఇదీ.
ఎమ్మెల్యేల ఎరకేసులో అనుమానితులుగా సిట్ నోటీసులు ఇచ్చిన బిఎల్ సంతోష్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న బీజేపీ నాయకుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయవర్గాలలో ఆసక్తికర చర్చకు దారితీశాయి. ఆయనే తెలంగాణకు వచ్చి మరీ హెచ్చరించి వెళ్లడంతో బీఆర్‌ఎస్ నేతల్లో గుబులు మొదలైంది.

ఎమ్మెల్యేల ఎరకేసుపై షాకింగ్ కామెంట్స్..
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలక భూమిక ఉందని అనుమానిస్తూ సిట్ విచారణకు హాజరుకావాలని బీఎల్.సంతోష్‌కు నోటీసులు జారీ చేసిన విషయం తెలసిందే. ఈ నేపథ్యంలో కోర్టును ఆశ్రయించిన ఆయన, తనకు సిట్ అధికారులు ఇచ్చిన నోటీసులపై స్టే తెచ్చుకున్నారు. తాజాగా తెలంగాణలో పర్యటించిన ఆయన అనవసరంగా కేసులో ఇరికించే ప్రయత్నం చేసి తనను అప్రతిష్టపాలు చేశారని అసహనం వ్యక్తం చేశారు. తనపై చేసిన అవాస్తవ ప్రచారానికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాదు తనపై ఆరోపణలు చేసిన వారు ముందు ముందు పర్యవసానాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.
రాజకీయ వర్గాల్లో చర్చ
హైదరాబాద్ సంపాదనను రాజకీయ అవసరాలకు దేశమంతా పంపుతున్నారని వ్యాఖ్యలు చేసిన బీఎల్.సంతోష్ తెలంగాణలో అధికారం మాత్రమే బీజేపీ ధ్యేయం కాదని, రాష్ట్రంలో అవినీతి నిర్మూలన కూడా లక్ష్యమని పేర్కొన్నారు. తాజాగా సంతోష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాలలో చర్చనీయాంశం అవుతున్నాయి. గులాబీ బాస్, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతోపాటు బీఆర్‌ఎస్ పార్టీ నేతలు, సిట్ అధికారులు బీఎల్.సంతోష్‌ని టార్గెట్ చేయాలని భావిస్తే, ఆయన నేరుగా రాష్ట్రానికి వచ్చి తీవ్ర పర్యవసానాలు ఎదుర్కొంటారు అంటూ వ్యాఖ్యలు చేయడం భవిష్యత్తు పరిణామాలకు సంకేతంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సర్కార్‌కు ఇక చుక్కలేనా?
ఇప్పటికే ఎమ్మెల్యేల ఎర కేసులో సీబీఐ రంగంలోకి దిగడానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోపక్క ఈడీ విచారణ ఈ కేసులో కొనసాగుతుంది. దీంతో బీఆర్‌ఎస్ పార్టీ నేతలు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ కొనసాగితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో బీఆర్‌ఎస్ అగ్రనాయకులు కూడా అంచనా వేస్తున్నారు. ఎమ్మెల్యేల ఎర కేసుతో బీజేపీని ఇరకాటంలో పెట్టాలని బీఆర్‌ఎస్ భావిస్తే అందుకు భిన్నంగా ఇప్పుడు ఈ టోటల్ వ్యవహారంలో బీఆర్‌ఎస్ పార్టీనే ఇరకాటంలో పడుతుంది. ఇక తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన బీఎల్.సంతోష్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సైతం ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి, బీఆర్‌ఎస్ నాయకులకు చుక్కలు చూపించడానికి రెడీ అయినట్లుగా సంకేతాలు ఇచ్చినట్లు కనిపిస్తుంది.

దాడులు మరింత పెరుగుతాయా?
అంతేకాదు బీఎల్.సంతోష్ మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ సంపదను రాజకీయ అవసరాలకు వాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి నిర్మూలన ధ్యేయం అని చెప్పడం కూడా రాష్ట్రంలో జరిగిన అనేక కుంభకోణాలు బయటకు తీసుకురావడానికి బీజేపీ సిద్ధమవుతోందని సంకేతం ఇచ్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఐటీ దాడులు, ఈడీ దాడులు, సీబీఐ దాడులు కొనసాగుతున్నాయి. వచ్చే ఎన్నికలలోపు కచ్చితంగా ఈ దాడులు ఉధృతం అవుతాయని, బీఆర్‌ఎస్‌పై ఒత్తిడి తప్పదని తెలుస్తోంది.
మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన సంతోష్‌ను సిట్ అధికారులు కానీ, తెలంగాణ ప్రభుత్వం గానీ టార్గెట్ చేయలేకపోయారు. కనీసం ఆయన్ను టచ్ కూడా చెయ్యలేకపోయారు. కానీ ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి, పర్యవసానాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరికలు జారీ చేసి మరీ వెళ్లడం ఆసక్తికరంగా మారింది.