PM Modi: కేంద్ర ప్రభుత్వంలో మళ్లీ బీజేపీ అధికారం చేపట్టే ఛాన్స్ ఉందా ? దేశ ప్రజలు మళ్లీ మోడీకి జై అననున్నారా ? ముచ్చటగా మూడో సారి బీజేపీ కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం ఉందా ? ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వినిపిస్తోంది.

ఎందుకు మోడీకే ఛాన్స్ ?
ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులు, ప్రాంతీయ పార్టీల అవసరాలు, సిద్ధాంతాలు, వాటి రాజకీయ భవిష్యత్తును అంచనా వేసుకుంటే కేంద్రంలో మళ్లీ బీజేపీకే పట్టం కట్టేలా కనిపిస్తున్నాయి. భారతదేశాన్ని అత్యకాలం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ప్రజల్లో ఆదరణ తగ్గిపోతోంది. మళ్లీ వచ్చే ఎన్నికల నాటికైనా కాంగ్రెస్ పూర్వ వైభవం సంతరించుకునే అవకాశాలు కనిపించడం లేదు. బలమైన ప్రతిపక్షం లేకపోవడం బీజేపీ కలిసి వచ్చే అవకాశం. దీంతో గత ఎన్నికల సమయంలో వచ్చినన్ని సీట్లు రాకపోయినా.. సునాయాసంగా అధికారాన్ని చేపట్టే సంఖ్య మాత్రం పొందగలుగుతామనే ధీమాలో బీజేపీ ఉంది.
కాంగ్రెస్‌పై కోపంతో ఉన్న వివిధ ప్రాంతీయ పార్టీలు..
ఇన్ని ఏళ్లుగా భారతదేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీపై వివిధ ప్రాంతీయ పార్టీలు కోపంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ లు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ. దీంతో స్వతహాగా బీజేపీకి సీట్లు రాకపోయినా.. ఈ ప్రాంతీయ పార్టీల సహకారం ఉండే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం అధికారం చేపట్టడంలో ఈ పార్టీలు సాయం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ ఎస్ అన్నట్టు నడుస్తోంది. కానీ చివరకు వచ్చే సరికి ఏమైనా జరగొచ్చు. రాజకీయాల్లో ఎప్పటికీ శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఇది చాలా సందర్భాల్లో నిజం అయ్యింది.
బీజేపీపై సామాన్యుడి అసంతృప్తి… అయినా..
కేంద్ర ప్రభుత్వంపై సామాన్యుడు కోపంగా ఉన్నాడు. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, నింగికంటిన నిత్యావసర వస్తువులు ధరల పెరుగుదల వల్ల బీజేపీపై ప్రజల్లో అంసతృప్తి కనిపిస్తోంది. ధరల పెరుగుదలల్లో రాష్ట్రాల పన్నులు కూడా ఉన్నప్పటికీ.. వాటిని కేంద్ర ప్రభుత్వ తప్పిదంగా చూపించడంలో ప్రతిపక్షాలు, స్థానిక ప్రాంతీయ పార్టీలు సఫలం అవుతున్నాయి. అయితే కోవిడ్ వ్యాక్సిన్ కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయిలు ఖర్చు చేసి, ప్రజలందరికీ ఉచితంగా అందజేస్తోందని, దాని లోటును భర్తీ చేసేందుకే ప్రజలపై కొంత భారం వేయక తప్పడం లేదని బీజేపీ నేతలు చెప్పకనే చెబుతున్నారు. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకి ఉన్న బలం, అవసరమైతే ఆదుకునే ప్రాంతీయ పార్టీల వల్ల మూడో సారి కూడా బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టే అవకాశం ఉంది.