
కేంద్రంలో మోడీ సర్కార్ ఇస్తున్న రూ.6 వేలు కలిపి అంతా తామే ఇస్తున్నట్టు వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందని బీజేపీ అంటుంది. ప్రచార ప్రకటనల్లో ప్రధాని బొమ్మను కూడా తీసేయటం రాష్ట్ర ప్రజలను మోసం చేయటమే. పీఎం కిసాన్ – రైతు భరోసా పథకంలో కేంద్రం వాటా 45% పైగా ఉన్నదని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోట సాయి కృష్ణ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నేడు విడుదల చేసిన పీఎం కిసాన్ – వైఎస్సార్ రైతు భరోసా ప్రకటనలో ప్రధాని బొమ్మనే లేకుండా చేసి మొత్తం రూ.13,500 తానే భరిస్తున్నట్టు బాక్స్ కట్టి మరీ ప్రచారం చేసుకుంటున్న వైనం సరైనది కాదన్నారు.
పాదయాత్రలో జగన్ రైతులకు ఇచ్చిన వాగ్దానం సంవత్సరానికి రూ. 12,500/- ఒకే సారి రైతుల ఖాతాలో జమ చేస్తానని ఇప్పుడు కేంద్రం ఇచ్చే సాయాన్ని కలిపి రైతులకు రూ.13,500 ఇవ్వడం రైతులను మోసం చేయడమైనని పేర్కొన్నారు. జగన్ అధికారంలోకి రాక ముందు నుంచే కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులకు పంట పెట్టుబడి సాయం క్రింద సంవత్సరానికి రూ. 6000 మూడు విడతలుగా ఇవ్వటం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో రైతులు కేంద్రం ఇస్తున్న ఆరు వేల రూపాయలకు అదనంగా జగన్ హామీ ఇచ్చిన రూ.12,500/- వస్తాయని నమ్మి అధికారం కట్టబెట్టారని చెప్పారు. ఇటువంటి అసత్య ప్రచారాలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని, తక్షణం ఈ అసత్య ప్రకటనను వెనక్కు తీసుకొని, ప్రధాని నరేంద్ర మోడీ బొమ్మతో కూడిన ప్రకటన విడుదల చేయాలని బీజేపీ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టిడిపి అధికారంలో ఉండగా టీడీపీ, బీజేపీ పొత్తు ఉన్న సమయంలో ఆ పార్టీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.