హుజురాబాద్ ఉప ఎన్నికపై పార్టీలు వ్యూహాలు మారుస్తున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త పల్లవి అందుకుంటూ ముందుకు వెళుతున్నాయి. ఒక్కో పార్టీ ఒక్కో తీరుగా ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అధికార పార్టీ వివిధ పథకాల పేరుతో ఓటర్లను ఆకట్టుకునేందుకు దూసుకుపోతోంది. దళిత బంధు పేరుతో ప్రజలను ఆకర్షించడానికి ప్లాన్ చేస్తోంది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పాదయాత్ర పేరుతో నియోజకవర్గం చుట్టి వచ్చేందుకు బయలుదేరారు. నియోజకవర్గంలో 127 గ్రామాలు చుట్టేందుకు ప్రణాళిక సిద్దం చేసుకున్నారు. ఇందులో భాగంగా ఓటర్ల ప్రసన్నం కోసం పావులు కదుపుతున్నారు.
బీజేపీ నేత ఈటల రాజేందర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు తిరుగుతూ 270 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసేందుకు నిర్ణయించుకున్నారు. రానున్న ఉప ఎన్నికలో ప్రజల మద్దతు కూడగట్టడమే కాకుండా ప్రజల్లో తనకున్న ఇమేజ్ ను మరింత పెంచుకునే వ్యూహంతో ఈటల ముందుకు వెళ్తున్నారు. ఎలాగైనా ప్రజల మద్దతు కూడగట్టుకుని అధికార పార్టీని దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో అధికార పార్టీలో కూడా గుబులు మొదలైనట్లు తెలుస్తోంది.
ప్రజల్లో తనకున్న ఇమేజ్ ను పెంచుకోవడానికి ఈ పాదయాత్ర ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఇదే సందర్భంలో పాదయాత్రను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి బీజేపీ సైతం ప్రయత్నిస్తోంది. ఈటల రాజేందర్ ద్వారా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి బలపడాలని భావిస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈటలను ముందు పెట్టి పార్టీ పరంగా పుంజుకోవడానికి బీజేపీ పావులు కదుపుతోంది.
టీఆర్ఎస్ వ్యూహానికి అడ్డుకట్ట వేసి నియోజకవర్గంలో తనకున్న మంచి పేరును మరింత పెంచుకునేలా ప్రజల్లో సానుభూతి పెరిగేలా ఈటల అడుగు వేస్తున్నారు. బీజేపీ బలమైన నాయకుడి ద్వారా పార్టీ బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే ఈటల పాదయాత్ర కొనసాగుతున్న మండలాల్లో బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాదయాత్రలో పాలుపంచుకుంటున్నారు.
ప్రజాదీవెన యాత్ర ద్వారా తన పట్టు తగ్గకుండా చూసుకుంటున్నారు. రాజకీయాల్లో ప్రస్తుత పరిస్తితుల్లో నాయకులు ఎవరికి వారు వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవటంపై ఫోకస్ పెడుతున్నారు. యాత్ర ద్వారా ఈటలకు లాభం చేకూరుతుందా? బీజేపీ నియోజకవర్గంలో మరింత బలపడుతుందా? అనే సందేహాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి. బీజేపీ ఈటల రాజేందర్ ద్వారా నియోజకవర్గంలో బలం పెంచుకుని ఎలాగైనా విజయం సాధించాలని చూస్తున్నట్లు సమాచారం.