AP BJP: ఏపీ విషయంలో బీజేపీ హైకమాండ్ పునరాలోచనలో పడిందా? టీడీపీతో పొత్తులండవని రాష్ట్ర బీజేపీ నేతలతో చెప్పిస్తునే..మరో ఆలోచన చేస్తున్నారా? ఢిల్లీ పెద్దల ఆలోచన మరోలా ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బ్యాక్ స్టెప్ వేయడంతో రకరకా చర్చలు మొదలయ్యాయి. మరీ ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ తరుపున పార్టీ వ్యవహారాలు చూసే శివప్రకాష్ జీ కలిసిన తరువాతే కన్నా లక్ష్మీనారాయణ స్వరం మార్చుకోవడం, ధీమాగా కనిపించడంతో ఢిల్లీ నుంచి ఏదో సంకేతం వచ్చిందన్న అనుమానాలు పెరుగుతున్నాయి.

కన్నా లక్ష్మీనారాయణ జనసేనలో చేరుతారన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. పలుమార్లు జనసేన కీలక నేత నాదేండ్ల మనోహర్ కన్నాతో భేటీ కావడంతో ఆయన పార్టీ మారడం ఖాయమన్న టాక్ నడిచింది. మొన్నటికి మొన్న రిపబ్లిక్ డే వేడుకల అనంతరం పవన్ సమక్షంలో జనసేనలో చేరతారన్న ప్రచారం సాగింది. అందుకు తగ్గట్టుగానే కన్నా అనుచరులు పార్టీకి రాజీనామా చేసి సిద్ధమయ్యారు. అయితే ఇప్పటికీ తాము బీజేపీ స్నేహం కోరుకుంటున్నామని పవన్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. 2014 ఎన్నికలలను రిపీట్ చేద్దామని భావిస్తున్నారు. టీడీపీ, బీజేపీతో కలిసి నడవాలని సంకేతాలు పంపించారు. అయితే జనసేన వరకూ ఒకే కానీ.. టీడీపీతో మాత్రం కలవడానికి బీజేపీ ఇష్టపడడం లేదు. పవన్ మాత్రం చివరి వరకూ వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఇటువంటి సమయంలో బీజేపీనేత కన్నాను పార్టీలోకి తీసుకుంటే రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరుగుతుందని భావిస్తున్నారు. అందుకే కన్నా చేరికను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఇటువంటి తరుణంలో ఆర్ఎస్ఎస్ తరుపున పార్టీ వ్యవహారాలు చూసే శివప్రకాష్ జీ కన్నాతో రెండు గంటల పాటు చర్చించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పుడున్నపరిస్థితుల్లో బీజేపీ ఒంటరి పోరాటం చేస్తే ఓట్లు, సీట్లు వచ్చే పరిస్థితి లేదు. అందుకే చాలామంది నాయకులు పక్క చూపులు చూస్తున్నారు. కీలక నాయకులు తప్పించి ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని భావించే నాయకులెవరూ పార్టీలో కొనసాగరని.. ఇప్పటికే చాలామంది ఆర్థికంగా నష్టపోయారని కన్నా శివప్రకాష్ జీకి వివరించినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై శివప్రకాష్ జీ ఎటువంటి భరోసా ఇచ్చారో తెలియదు కానీ.. కన్నా లక్ష్మీనారాయణ మాత్రం తాను బీజేపీలో కొనసాగుతానని ప్రకటించడం వెనుక విశ్లేషణలు ప్రారంభమయ్యాయి.
ఏపీలో అధికార వైసీపీ సర్కారు హిందుత్వ వ్యతిరేకి అని ఆర్ఎస్ఎస్ భావిస్తోంది. అది అత్యంత ప్రమాదకరమన్న భావనకు వచ్చింది. బీజేపీ హైకమాండ్ కు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్టు వార్తలు వచ్చాయి. అటు రాష్ట్రంలో జనసేన, టీడీపీలతో కలిసి వెళ్లకుంటే పార్టీ మరింత ఉనికి కోల్పోయే ప్రమాదముందని నిఘా వర్గాలు సైతం కేంద్రానికి నివేదికలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ నేతను రంగంలోకి దించి పార్టీ నుంచి వలసలకు అడ్డుకట్ట వేయగలిగింది. అయితే కన్నాకు ఏం లెక్కలు వేసి అడ్డుకట్ట వేశారో తెలియదు కానీ.. త్వరలో ఓ కీలక నిర్ణయం కేంద్రం నుంచి వెలువడే అవకాశముందన్న సంకేతాలు మాత్రం ఇచ్చినట్టు తెలుస్తోంది.