ABN RK- Thota Chandrasekhar: దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ ను విస్తరించే పనిలో ఉన్నారు కేసీఆర్. ఏపీతోపాటు ఒడిశా, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడుల నుంచి భారీగా చేరికలకు ప్రయత్నిస్తున్నారు. ఏపీలో ఇప్పటికే కొందరు నేతలు బీఆర్ఎస్ లో చేరారు. ఒడిశాలో అయితే మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గొమాంగో, ఆయన కుమారుడితో పాటు ఒకరిద్దరు మాజీ ఎంపీలు బీఆర్ఎస్ బాట పట్టారు. అటు మహారాష్ట్ర నుంచి కూడా నాయకులను చేర్పించుకునే పనిలో ఉన్నాయి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఏపీ విషయంలో బీఆర్ఎస్ విస్తరణ కత్తిమీద సామే. అందుకే అక్కడ పక్కా వ్యూహంతో కేసీఆర్ పావులు కదిపినట్టు వార్తలు వచ్చాయి. హైదరాబాద్ మూలాలు కలిగిన నేతలను టార్గెట్ చేసే క్రమంలో తోట చంద్రశేఖర్ తారసపడ్డారని.. ఆయనకు భారీగా లబ్ధి చేకూర్చడం ద్వారా ఆకర్షించగలిగారన్న ప్రచారం ఒకటుంది. భారీగా భూసంతర్పణ జరిగిందన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ అదే విషయాన్ని చెప్పారు. అసలు తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ లో ఎందుకు చేరారో? రాష్ట్ర అధ్యక్ష పదవిని ఎందుకు తీసుకున్నారో? ఓపెన్ సీక్రెట్ తెలుసునని ప్రకటించారు. బీఆర్ఎస్ కు చెందిన పైలెట్ రోహిత్ రెడ్డిని ఇంటర్వ్యూ చేసే సమయంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

తోట చంద్రశేఖర్ చిరంజీవి కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయి. అటు చిరంజీవి ప్రజారాజ్యం, మొన్నటి వరకూ జనసేనలో యాక్టివ్ రోల్ ప్లే చేశారు. ఈయన మాజీ ఐఏఎస్ అధికారి. ఈ నెల 2న భారత్ రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. మహారాష్ట్ర కేడర్‌కు చెందిన తోట చంద్రశేఖర్.. 2008లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆదిత్య హౌజింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉంటూ.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. గతంలో వైసీపీ నుంచి ఏలూరు ఎంపీగా పోటీ చేశారు. ఆ తర్వాత 2019లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. తాజాగా.. బీఆర్ఎస్ ఏపీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు.అయితే చంద్రశేఖర్ బీఆర్ఎస్ లోకి వచ్చిన తరువాత ఆయనపై ఆరోపణలు మొదలయ్యాయి.
తోట చంద్రశేఖర్ రావుకు పరిశ్రమలు, విలువైన ఆస్తులు తెలంగాణలో ఉన్నాయి. ఏపీలో బీఆర్ఎస్ విస్తరించాలనుకున్న తరుణంలో నాయకులెవరూ ముందుకు రాలేదు. రాష్ట్ర విభజన సమయంలో కేసీఆర్ వ్యాఖ్యలు, చర్యలను ఏపీ ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నారు. అది నిఘా వర్గాల ద్వారా కేసీఆర్ కు తెలిసింది. ఈ నేపథ్యంలో బలమైన రాజకీయ నేపథ్యం కలిగి, కీలకసామాజికవర్గం నేతలు అవసరమని భావించిన కేసీఆర్ కన్ను తోట చంద్రశేఖర్ పై పడింది. పైగా ఆయన ఆర్థిక మూలాలన్నీ తెలంగాణలో ఉండడంతో కేసీఆర్ పని ఈజీ అయ్యింది. ప్రధానంగా హైదరాబాద్ లో మియాపూర్ లో తోట చంద్రశేఖర్ కు 4 వేల కోట్లు విలువచేసే 40 ఎకరాలను కేసీఆర్ ధారాదత్తం చేశారన్న ఆరోపణలు వినిపించాయి. బీజేపీ నేతలు సైతం అవే ఆరోపణలు చేశారు.

ఈ నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని ఇంటర్వ్యూ చేసే క్రమంలో ఏబీఎన్ రాధాక్రిష్ణ ఇదే విషయంపై స్పష్టత ఇచ్చారు. తోట చంద్రశేఖర్ ను ఏ స్థాయిలో ప్రలోభపరిచారో అన్ని ఎవిడెన్స్ తన దగ్గర ఉన్నాయని గట్టిగానే చెప్పారు, అయితే అవి మియాపూర్ భూములా? లేక ఇంకా అంతకు మించి కేటాయింపులు చేశారా? అన్నది మాత్రం బయటపెట్టలేదు. అటు కేసీఆర్, ఇటు తోట చంద్రశేఖర్ రావు ల గుట్టు తెలుసు అంటూ ఆర్కే స్పష్టమైన హెచ్చరికల సంకేతాలు పంపగలిగారు.