ఎడారి రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. రోజురోజుకు రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. సీఎం అశోక్ గెహ్లట్ , పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య నెలకొన్న విబేధాలు తారాస్థాయికి చేరాయి. సచిన్ పైలట్ ఆయన మద్దతుదారులతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు యత్నిస్తున్నారని గెహ్లట్ వర్గంలో ఆరోపిస్తుంది. ఈనేపథ్యంలో సచిన్ పైలట్ తో కాంగ్రెస్ అధిష్టానం సంప్రదింపులకు ప్రయత్నించింది. అయితే సచిన్ పైలట్ నుంచి స్పందన కరువడంతో సచిన్ పైలట్ ను పీసీసీ చీఫ్, డిప్యూటీ పదవీ నుంచి తొలగిస్తున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం తాజాగా ప్రకటించింది.
కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న బీజేపీ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. సచిన్ పైలట్ పై కాంగ్రెస్ అధిష్టానం వేటువేసిన వెంటనే బీజేపీ సీనియర్ నేత ఓం మాథుర్ స్పందించారు. బీజేపీ విధివిధానాలు నచ్చినవారు తమ పార్టీలోకి రావొచ్చని ఆహ్వానం పలికారు. అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని ప్రకటించిన గెహ్లాట్ అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు.
సచిన్ పైలెట్ పై కాంగ్రెస్ వేటు.. తర్వాత ఏంటీ?
కాంగ్రెస్ అధిష్టానం తనపై వేటువేయడంపై సచిన్ పైలట్ కూడా స్పందించారు. సత్యాన్ని వక్రీకరించగలరేమో కానీ ఓడించలేరంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. అయితే పార్టీ మారే విషయంపై ఆయన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. నేటి సాయంత్రం లోపు సచిన్ తన రాజకీయ భవిష్యత్ పై కీలక నిర్ణయం తీసుకుంటారని ప్రచారం రాజస్థాన్లో జోరుగా సాగుతోంది.
బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిక కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలన్నీ ఒక్కొక్కటిగా బీజేపీ వశమవుతున్నాయి. కర్ణాటక, మధ్యప్రదేశ్ తరహాలోనే రాజస్థాన్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని అనుమానాలు కలుగుతున్నారు. మధ్యప్రదేశ్ తరహాలోనే రాజస్తాన్లో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు పావులు కదుపుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈమేరకు సచిన్ పైలట్, ఆయన మద్దతుదారులకు బీజేపీ రెడ్ కార్పెట్ పరుస్తుందనే వాదనలు విన్పిస్తున్నాయి.
అయితే సచిన్ పైలట్ బీజేపీ చేరుతారా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ సచిన్ పైలట్ తన మద్దతుదారులతో బీజేపీలో చేరితే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు సచిన్ సొంతపార్టీ పెడుతారని ప్రచారం కూడా జరుగుతుంది. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. నేటి సాయంత్రంలోగా ఆయన రాజకీయ భవిష్యత్ పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఏది ఏమైనా ప్రస్తుతం రాజస్థాన్లో జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేలా కన్పిస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను కొల్పోయిన కాంగ్రెస్ మరో రాష్ట్రం చేజారిపోకుండా ఎలాంటి చర్యలు తీసుకుందో వేచి చూడాల్సిందే..!