రాజస్థాన్ లో అధికార కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం సంక్షోభం ముంగిట నిలిచింది. తిరుగుబాటు చేసిన రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలెట్ ను బుజ్జగించే ప్రయత్నాలకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపించడం లేదు. పార్టీ కార్యకలాపాలకు ఆయన కూడా దూరంగా ఉన్నారు. ఆయన తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలతో కలిసి గురుగ్రామ్ లో ఒక హోటల్లో ఉన్నట్టు చెబుతున్నారు.
మంగళవారం జరగబోయే రెండో సమావేశానికి తప్పకుండా హాజరు కావాలని అంతకుముందు జరిగిన కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు సచిన్ పైలట్ ను కోరారు. కానీ సచిన్ దానికి కూడా వెళ్లలేదు. జైపూర్ లోని హోటల్ ఫెయిర్ మౌంట్ లో మంగళవారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి సచిన్ పైలట్, ఆయనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు రాలేదు.
“మేం సచిన్ పైలెట్ కు మరో అవకాశం ఇస్తున్నాం. ఆయన పార్టీ సమావేశంలోకి రావాలని చెబుతున్నాం. ఆయన వస్తారని, రాజస్థాన్ ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తారని మేం ఆశిస్తున్నాం” అని మంగళవారం ఉదయం శాసనసభా పక్ష సమావేశంలో మొదట రాజస్థాన్ కాంగ్రెస్ ఇంచార్జ్ అవినాశ్ పాండే అన్నారు.
మరోవైపు తనకు రాహుల్ గాంధీని కలవాలనే ఆలోచనలు ఏమాత్రం లేవని సచిన్ పైలెట్ చెప్పారు. ఒక టీవీ చానల్ తో మాట్లాడిన ఆయన పార్టీ బుజ్జగింపు ప్రయత్నాలకు తను దూరంగా ఉన్నానని చెప్పారు.