మోడీ ప్రధానమంత్రి అభ్యర్ధి ప్రకటన బిజెపి కి కలిసొచ్చిన అదృష్టం
2014 లోక్ సభ ఎన్నికల ముందు ఎవరు ప్రధానమంత్రి అభ్యర్ధి గా ముందుకు పెట్టి ఎన్నికలకు వెళ్ళాలనేది పార్టీలో వివాదాస్పద మయ్యింది. కురువృద్ధులు ఎల్ కె అద్వాని, మురళి మనోహర్ జోషి, యశ్వంత్ సిన్హా, సుష్మా స్వరాజ్ లాంటి వారు ఎటువంటి పరిస్థితుల్లో మోడీ ని అభ్యర్ధిగా ప్రకటించటానికి ఇష్టపడలేదు. వాళ్ళ మాటను కాదనటం అప్పటికి పార్టీలో అంత తేలికైన పనికాదు. కాని అప్పటికే ప్రజల్లో , క్యాడర్ లో మోడీ అయితేనే కాంగ్రెస్ ని ఎదుర్కోగలం అనే భావన వచ్చింది. రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, మనోహర్ పారిక్కర్, వెంకయ్య నాయుడు లాంటి వారు ప్రజలనాడి ని పసిగట్టి మోడీ కి అనుకూలంగా పావులు కదిపారు. అప్పటికే అనేకరకాల కుంభకోణాలతో భ్రష్టు పట్టిన యు పిఎ కి వ్యతిరేకంగా ప్రజల్లో వచ్చిన తిరుగుబాటు పవనాలు, మోడీ సానుకూల పవనాలు కలగలిపి మోడీ నాయకత్వం లో పూర్తి మెజారిటీ తో బిజెపి ని అధికారంలో కూర్చోబెట్టాయి. కాకుండా అద్వాని అధ్వర్యంలో ఎన్నికలకు వెళ్లి వుంటే లోక్ సభ హంగ్ సభగా అవతరించి వుండేది. ఆ కీలక నిర్ణయమే బిజెపి ని అధికారంలోకి తీసుకెళ్ళింది. ఆ తర్వాత బిజెపి కి అంతా పూలబాటనే. మధ్యలో కొన్ని అసెంబ్లీ లు పోగొట్టుకున్నా ఆ రాష్ట్రాల్లో కూడా ఓట్ల శాతం లో పెద్ద మార్పులేకపోవటం గమనించ దగ్గ విషయం.
బీహార్, బెంగాల్, అస్సాం ఎన్నికల్లో వాతావరణం
ఇప్పుడు అందరి మదిలో వున్న ప్రశ్న. కరోనా మహమ్మారి నేపధ్యంలో లక్షలాది వలస కార్మికులు పడ్డ కష్టాలు అందరికీ తెలిసిందే. ఇందులో ఎక్కువమంది కార్మికులు బీహార్ కి చెందినవారే. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వీళ్ళను రాష్ట్రంలోకి రావద్దని చెప్పటం పెద్ద వివాదాన్ని సృష్టించటమే కాకుండా, తనకు అప్రతిష్టను మూట కట్టుకొచ్చింది. అప్పటివరకు నితీష్ పై వున్న మంచి పేరు కు భంగం కలిగింది. అది ఇటీవల వెలువడిన ప్రజాభిప్రాయ సేకరణ లో కూడా వ్యక్తమయ్యింది. అయినా ఆయనకు దీటుగా ఎవరూ లేరు. అదీగాక, బీహార్ లో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఎన్ డి ఎ లో బెజెపి, జేడియు తో పాటు మత్సకార్లకు, నావలు నడిపే వారికి సంబంధించిన వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ, బీహార్ మాజీ ముఖ్య మంత్రి జితిన్ రాం మంజీ కి చెందిన హిందూస్తాన్ అవాం పార్టీ లు వున్నాయి. లోక్ జన శక్తి పార్టీ బయటకొచ్చింది. అలాగే యూపీఏ లో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. అంతకుముందున్న ఆర్ ఎల్ ఎస్ పి, వి ఐ పి, జితిన్ రాం మంజీ లు బయటకు వచ్చాయి. కొత్తగా మూడు కమ్యూనిస్టు పార్టీలు చేరాయి. ఈ రెండు కూటమిలతో పాటు ఇంకా అయిదు కూటమి లు బరిలో వున్నాయి. ఒవైసీ కి చెందిన మజ్లీస్, మాజీ కేంద్రమంత్రి డి పి యాదవ్ కి చెందిన సమాజ్ వాది జనతా దళ్ కలిసి ఐక్య ప్రజాస్వామ్య సెక్యులర్ కూటమి గా పోటీ చేస్తున్నాయి. అభ్యుదయ కూటమి పేరుతో పప్పు యాదవ్ కి చెందిన జనాదికార్ పార్టి, భీం ఆర్మీ కి చెందిన ఆజాద్ సమాజ్ పార్టి, పిఎఫ్ ఐ కి చెందిన ఎస్ డి పిఐ , బహుజన్ ముక్తి పార్టి లు కలిసి పోటీ చేస్తున్నాయి. ఉపేంద్ర కుష్వాకి చెందిన ఆర్ ఎల్ ఎస్ పి, మాయావతి కి చెందిన బిఎస్పి, జన వాది సోషలిస్ట్ పార్టి లు కలిసి ఇంకో కూటమిగా పోటీ చేస్తున్నాయి. అలాగే ఐక్య ప్రజాస్వామ్య కూటమి పేరుతో యశ్వంత్ సిన్హా ఆధ్వర్యం లో 20 చిన్న, చితకా పార్టీలు పోటీ చేస్తున్నాయి. వీటితోపాటు స్వర్గీయ రాం విలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ కి చెందిన లోక్ జనశక్తి పార్టీ కూడా రంగం లో వున్నాయి. ఇప్పటికి ఈ ఏడు కూటమిలు బరిలో వున్నాయి. విశేషమేమంటే ఇందులోని అయిదు కూటముల ప్రధాన లక్ష్యం బిజెపి కూటమిని ఓడించటం. అంటే బిజెపి యేతర ఓట్లు చీలుతున్నాయన్న మాట. ఇదీ బీహార్ పరిస్థితి.
ఇక అస్సాం లో చూస్తే ఇదే సీను రిపీట్ అవుతుంది. బిజెపి కి వ్యతిరేకంగా కాంగ్రెస్, బద్రుద్దీన్ నాయకత్వం లోని ఏ ఐ యు డి ఎఫ్, కమ్యూనిస్టులు కలిసి పోటీ చేయటానికి సూత్రప్రాయ అంగీకారం కుదిరింది. దీనితోపాటు ఇంకో నాలుగు కూటములు పోటీ చేస్తున్నాయి. రాయ్ జోర్ దళ్ పేరుతో షుమారు 70 జాతుల సముదాయం తో కూడిన కృషక్ ముక్తి సంగ్రాం సమితి మద్దత్తు తో ఓ కూటమి పోటీ చేస్తుంది. అలాగే అస్సాం జాతీయ పరిషద్ పేరుతో విద్యార్ధి, యువ సంఘాలైన ఆసు, అస్సాం జాతీయ వాది యువ చాత్ర పరిషద్ పోటీ చేస్తున్నాయి. వీటికి అదనంగా అంచాలిక్ గణ మోర్చా, అస్సాం ఐక్య ప్రాంతీయ పార్టి పోటీ చేస్తున్నాయి. విశేషమేమంటే ఇక్కడా ఈ అయిదు కూటములు బిజెపిని ఓడించటమే లక్ష్యంగా పోటీ చేస్తున్నాయి.
పశ్చిమ బెంగాల్ లో టిఎంసి, బిజెపిలతో పాటు కాంగ్రెస్-వామపక్ష కూటమి, ఒవైసీ నాయకత్వంలోని మజ్లీస్, ఇస్లాం మత గురువు అబ్దుల్ సిద్దికి కలిసి వేరే కూటమిగా పోటీ చేయబోతున్నారు. ఇక్కడా ఈ మూడు కూటముల లక్ష్యం బిజెపి ని ఓడించటం. నిన్ననే బిజెపి నిర్వహించిన సెక్రటేరియట్ ముట్టడి విజయవంతమయిందనే చెప్పాలి. ఈ నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారింది. ఇది ఊహించిందే. బెంగాల్ లో ఇది ఓ సంకేతం. వామ పక్ష ప్రభుత్వం అధికారం లో వున్నప్పుడు మమత బెనర్జీ నిర్వహించిన ప్రదర్శనలు కూడా ఇలానే హింసాత్మకం గా ఉండేవి. దురదృష్టవశాత్తు బెంగాల్ ని పాలించిన పాలకులు కనీస ప్రజాస్వామ్య విలువల్ని పాటించటం ఎప్పుడూ లేదు. కాకపోతే నిన్నటి ప్రదర్శన మమతా బెనర్జీ కి బిజెపి గట్టి సవాలు నే విసురు తుందని అర్ధమవుతుంది.
బిజెపి వైపు తూర్పు గాలి వీస్తుందా?
వస్తున్న సంకేతాలు చూస్తే అవుననే సమాధానం వస్తుంది. ఝార్ఖండ్ లో లాగా బిజెపి వ్యతిరేక పార్టీలు ఒకతాటి మీదకు రాకపోయే టట్లయితే ఫలితం బిజెపి కి అనుకూలంగా వుండటం ఖాయం గా కనిపిస్తుంది. అంటే దీనర్ధం బిజెపి హిందీ ప్రాంతాలు, పశ్చిమ భారతం లాగా తూర్పు ప్రాంతాల్లో కూడా 2014 తర్వాత బలమైన శక్తిగా ఎదిగిందన్న మాట. ఇది బిజెపి పై వున్న ముద్రను కూడా చెరుపు తుంది. ఇది అన్ని ప్రాంతాలకు చెందిన పార్టీ గా అవతరించింది. రెండోది, అన్ని వర్గాలకు సంబంధించినదిగా ఎదిగింది. ఉదాహరణకు, బెంగాల్ లో బ్రాహ్మణ-బనియా, కాయస్థ కులాలకు చెందిన భద్రకాళి వర్గం ఇప్పటికీ టిఎంసి, సిపిఎం ల వైపే వున్నాయి. బిజెపి కింద దళితులూ, మిగతా అణగారిన జాతులు సమీకరించబడ్డారు. కాబట్టి అగ్ర వర్ణాలతో బిజెపి ని ముద్ర వేయటం సాధ్యపడదు. మూడోది, అన్ని మతాలకు సంబంధించినదిగా ఎదిగిందా అంటే లేదనే చెప్పాలి. ఈశాన్య భారతం లో క్రైస్తవులు బిజెపి కూటమిలోని పార్టీల కింద సమీకరించబడ్డా ఇప్పటికీ బిజెపి ఈ విషయం లో విఫల మయ్యిందనే చెప్పాలి. ముఖ్యంగా ముస్లిం లు ఇప్పటికీ బిజెపి ని శత్రు పార్టీగానే చూస్తున్నారు. ముందు ముందు ఈ మూడో అంశం పై కూడా బిజెపి విజయవంతం అయితే పార్టీ ‘ సబ్ కా సాత్, సబ్ కా విశ్వాస్, సబ్ కా పార్టీ’ గా అవతరిస్తుంది.