Visakha Bike Racing: విశాఖ నగరం.. ప్రశాంతతకు నెలవు. అన్నివర్గల వారికి ఇష్టమైన నగరంగా మారిపోయింది. పర్యాటకంగా ప్రకృతి ప్రేమికుల మదిని దోచుకుంటుంది. అటువంటి నగర ఖ్యాతిని ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు మసకబారుస్తున్నాయి. నగరవాసులను ఆందోళన కలిగిస్తున్నాయి. పాశ్చత్య నగరం పోకడలతో యువత భయాందోళనకు గురిచేస్తున్నారు. రెండు రోజుల కిందట అర్థరాత్రి సమయంలో వందలాది మంది యువకులు బైకులతో రోడ్లపైకి వచ్చి వీరంగం సృష్టించారు. నిశీ రాత్రిలో పెద్ద దుమారమే రేపారు. నగర రహదారులపై రయ్ రయ్ మంటూ భారీ శబ్ధాలతో రోత పుట్టించారు. అంతటితో ఆగకుండా వివిధ అవసరాలకు నగరంపై వచ్చేవారిపై దాడికి ప్రయత్నించారు. ఈ ఘటన నగరవాసులను ఆందోళనకు గురిచేసింది.
నగరవాసులు హడల్..
వందలాది మంది ఒకేసారి రోడ్డుపైకి రావడం , ర్యాష్ డ్రైవింగ్ చేయడంపై నగరవాసులు విస్తుపోతున్నారు. అటు పోలీసులకు సవాల్ గా మారిన ఘటన నగర భద్రత, నిఘాను ప్రశ్నార్థకం చేసింది. పోలీసులను సైతం నివ్వెరపరచింది. విశాఖ సముద్ర తీరం ఉన్న నగరంలో ఇటువంటి దుశ్చర్యలు మరింత శృతిమించే అవకాశముందని భావిస్తున్నారు. అందుకే పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఘటనకు కారకులైన వారిపై కేసులు నమోదుచేయడంతో పాటు వాహనాలను స్వాధీనంచేసుకున్నారు. రైడ్ లో భాగస్థులైన యువత, ఉద్యోగులకు నోటీసులిచ్చారు. వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. మరోసారి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటే కేసులు నమోదుచేస్తామని హెచ్చరించారు.
Also Read: Vijayashanti- KCR: కేసీఆర్ కు విజయశాంతి అంటే ఎందుకు ప్రత్యేకమంటే
చీమలదండుగా..
ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి దాటిన తరువాత సుమారు 300 మంది యువకులు బైకులతో నగర రహదారులపైకి చేరారు. స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం, ఆర్టీసీ కాంప్లెక్స్, చినవాల్తేరు మీదుగా బీచ్ రోడ్లలో చక్కర్లు కొట్టారు. ఒక చీమల దండుగా మారి సుమారు కిలోమీటరు పొడవునా బైక్ లతో ర్యాష్ డ్రైవ్ చేస్తూ హల్ చల్ సృష్టించారు. అంతటితో ఆగకుండా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద శ్రీకాకుళం వైపు వెళుతున్న ఆర్డీసీ బస్సు డ్రైవర్ పై దాడికి ప్రయత్నించారు. బస్సుకు అడ్డంగా తప్పుకోమని డ్రైవర్ కోరగా.. కోపోద్రిక్తులైన యువకులు బస్సు అద్దం వైఫర్ ను తొలగించి డ్రైవర్ పై చేయి చేసుకున్నారు. చినవాల్తేరు వద్ద కారుపై వస్తున్న వారిని అటకాయించి దాడి చేశారు.
హరన్ల మోత..
బీచ్ రోడ్ లో హరన్ మోతలతో సమీప నివాసితులకు దడ పుట్టించారు. బారీ డెసిబుల్ శబ్ధాల సైలెన్సర్ల మోత మోగించారు. నగరవాసులకు చుక్కలు చూపించారు. అయితే రాత్రి గస్తీ విధుల్లో ఉన్న పోలీసులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఇంతమంది ఒకేసారి రోడ్డుపైకి రావడంతో ఆందోళనకు గురయ్యారు. వారిని అదుపులోకి తీసుకునే పనిలో పడ్డారు. అయితే పోలీసులు రంగప్రవేశం చేయడంతో బైక్ రైడర్లు చేరో మార్గంలోకి వెళ్లిపోయారు. కొందరు పట్టుబడ్డారు. మరికొందరు తప్పించుకున్నారు. దాదాపు 300 మంది రైడర్ష్ పాల్గొనగా.. 44 మందిని అదుపులోకి తీసుకున్నారు.. వీరిలో అతి తీవ్రంగా ప్రవర్తించిన 13 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మిగతా 31 మందికి నోటీసులిచ్చి విడిచిపెట్టారు. 39 బైకులను స్వాధీనం చేసుకున్నారు. 44 మందిలో 22 మంది విద్యార్థులు, 13 మంది ఉద్యోగులు, తొమ్మిది మంది వ్యాపారులు ఉండడం విశేషం. వారి తల్లిదండ్రులను పిలిపించిన పోలీసులు కౌన్సెలింగ్ ఇప్పించారు.
రైడ్ సంస్కృతి
అయితే విశాఖ నగరంలో ఇప్పుడిప్పుడే అర్ధరాత్రి రైడ్ సంస్కృతి వెలుగుచూస్తోంది. సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకొని రైడ్ కు యువతను ఆహ్వానిస్తున్నారు. ఇందుకుగాను ప్రత్యేక వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇందులో చిట్టూరి ఉపేంద్ర ఇన్ స్టా గ్రూప్ ఎంతో ప్రాచుర్యం పొందింది. రకరకాల బైక్ విన్యాసాలతో ఈ గ్రూపులో పోస్టులు వస్తాయి. పలానా రోజు.. పలానా చోటు నుంచి రైడ్ ప్రారంభమవుతుందని సమాచారమిస్తారు. అయితే మొన్న ఘటనకు సంబంధించి అరగంట వ్యవధిలోనే 300 మంది యువకులు రోడ్డుపైకి వచ్చినట్టు పోలీసుల విచారణలో తేలింది.
రూట్ మ్యాప్..
దాదాపు నగర రహదారులు సుమారు 150 కిలోమీటర్ల వరకూ విస్తరించి ఉన్నాయి. అయితే ఈ రైడ్ కు రూటు మ్యాపు సైతం ఉంటుంది. మధ్య మధ్యలో భారీ రోడ్లలో బైకులను చుట్టూ పెట్టి విన్యాసాలు చేస్తారు. పందాలు కాస్తారు. భారీగా నగదు చేతులు మారుతుందని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు డ్రగ్స్, నిషేధిత వస్తువులు సైతం వినియోగిస్తుంటారని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే యువత పెడదోవ పట్టకుండా తల్లిదండ్రులు కన్నేసి ఉంచాలని నగర పోలీసులు విన్నవిస్తున్నారు. మరోవైపు ఇటువంటి ఘటనలు జరగకుండా విశాఖ నగర పోలీస్ కమిషనర్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటుచేశారు. కఠినచర్యలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.
Also Read:ABN RK: జగన్ బాధితులే టార్గెట్…ఏబీఎన్ ఆర్కే నయా ప్లాన్