Tejaswi Yadav : ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నుంచి మొదలుపెడితే ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ దాకా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నవారే. ఇప్పుడు ఈ జాబితాలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ చేరారు. తేజస్వి యాదవ్ బీహార్ ఉప ముఖ్యమంత్రిగా పని చేస్తున్నప్పుడు అధికారిక బంగ్లాను ఉపయోగించుకున్నారు. ఆయన నివాసం ఉన్న బంగ్లాలో ఏసీ, సోఫా, ట్యాప్ లు ఉండేవి. అయితే నితీష్ కుమార్ ప్రభుత్వం నుంచి బయటికి వచ్చిన తర్వాత తేజస్వి యాదవ్ తన ఉప ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. దీంతో ఆయన తన అధికారిక బంగ్లాను ఖాళీ చేయాల్సి వచ్చింది.. బంగ్లా ఖాళీ చేస్తున్న సమయంలో సోఫా, ఏసి, ట్యాప్ లు తీసుకెళ్లిపోయారని బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు. తేజస్వి యాదవ్ తన పదవి కోల్పోయిన తర్వాత.. బంగ్లాను ఖాళీ చేస్తున్న సమయంలో వాటిని తన వెంట తీసుకెళ్లారని బిజెపి నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. బీహార్ రాష్ట్రంలో రాష్ట్రీయ జనతా, జెడ్ యు – కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపాయి. ఆ సమయంలో తేజస్వీ యాదవ్ ఉపముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ ప్రభుత్వం పడిపోవడంతో ఉప ముఖ్యమంత్రి పదవికి తేజస్వి యాదవ్ రాజీనామా చేశారు. ఫలితంగా ఆయనకు అప్పట్లో కేటాయించిన దేశరత్న మార్గంలో బంగ్లాను ఖాళీ చేశారు.
ఖాళీ చేసిన తర్వాత..
బంగ్లాను తేజస్వి యాదవ్ ఖాళీ చేసిన తర్వాత అందులో పలు వస్తువులు కనిపించకుండా పోయాయని బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు..” పరుపులు, ఏసి, సోఫా, వాష్ బేసిన్స్, వాష్ రూమ్ లోనే టాప్స్, పూల కుండీలు, జిమ్ పరికరాలు కనిపించకుండా పోయాయి. ఏ వస్తువులు కనిపించకుండా పోయాయో.. వాటికి సంబంధించిన జాబితాను త్వరలో విడుదల చేస్తాం. వీటిపై విచారణ జరగాల్సి ఉంది. అధికారిక బంగ్లాను అధికారం ఉన్నప్పుడు మాత్రమే వినియోగించుకోవాలి. అంత తప్ప అధికారం పోయిన తర్వాత అందులో వస్తువులను తీసుకెళ్లకూడదు. దాణా ను దొంగిలించిన వారికి.. ఈ వస్తువులను తస్కరించడం పెద్ద లెక్క కాదు.. అయినప్పటికీ వీటి గురించి మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. నిజాలు వెలుగులోకి రావాలి. ప్రజలకు ఎవరు ఎలాంటి వాళ్లో తెలియాలని” బిజెపి నాయకులు అంటున్నారు. ఇదే సమయంలో తేజస్వి యాదవ్ వర్గం వారు కూడా స్పందిస్తున్నారు. ఎన్నికల ముందు ఇలాంటి చవకబారు ఆరోపణలు చేసి ప్రజల్లో.. తేజస్వి యాదవ్ ను చులకన చేయాలని బిజెపి నాయకులు ప్రయత్నిస్తున్నారని.. వారి ఆటలు సాగవని అంటున్నారు. కాగా, ఈ వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చకు దారి తీస్తోంది.