Chandrababu: చంద్రబాబు కేసుల విషయంలో ఈరోజు కీలకం. స్కిల్ స్కామ్ లో తన అరెస్ట్ అక్రమమని చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తన అరెస్టు విషయంలో సిఐడి నిబంధనలు పాటించలేదని చెబుతూ చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి. అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. నేడు తీర్పు వెల్లడించనుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై విడుదలయ్యారు. అనారోగ్య కారణాలు చూపడంతో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబును సెప్టెంబర్ 9 అర్ధరాత్రి సిఐడి అరెస్టు చేసింది. రోడ్డు మార్గం గుండా విజయవాడ తీసుకొచ్చింది. ఏసీబీ కోర్టులో హాజరుపరచగా చంద్రబాబుకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. తన అరెస్టు విషయంలో సిఐడి నిబంధనలు పాటించలేదని చెబుతూ చంద్రబాబు ఏసీబీ కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ పిటిషన్ డిస్మిస్ చేయడంతో.. హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ సైతం చుక్కెదురు కావడంతో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. క్వాష్ పిటిషన్ పై సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. చివరిగా అక్టోబరు 20న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. తీర్పును రిజర్వ్ చేసింది. నవంబర్ 8న తీర్పు వెల్లడించనున్నట్లు చెప్పింది. ఇప్పుడు ఆ సమయం ఆసన్నం కావడంతో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.
అయితే సుప్రీంకోర్టు తీర్పు పై తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. తప్పకుండా చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశాభావంతో ఉన్నారు. ప్రధానంగా 17a సెక్షన్ చుట్టూ వాదనలు కొనసాగాయి. చంద్రబాబు అరెస్టు విషయంలో గవర్నర్ అనుమతి తీసుకోలేదని.. ఆయన ఈ రాష్ట్రానికి సుదీర్ఘంగా పాలించిన సీఎం అని.. అవినీతి కేసుల విషయంలో రాజకీయ కక్షపూరితంగా ప్రభుత్వాలు వ్యవహరించకూడదని.. అవినీతి కేసులను విచారించే క్రమంలో నిందితులుగా ఉండే రాజకీయ ప్రముఖులను అరెస్టు చేసే సమయంలో తప్పకుండా గవర్నర్ అనుమతి తీసుకోవాలని.. 2018లో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని సవరించింది. అయితే అంతకంటే ముందే ఈ కేసు నమోదై ఉందని.. అందుకే గవర్నర్ అనుమతి అవసరం లేదని సిఐడి వాదిస్తోంది. అయితే చంద్రబాబుపై కేసు నమోదు తో పాటు ఎఫ్ఐఆర్ లో పేరు చేర్చడం ఇటీవలే జరిగిందని.. తప్పకుండా 17 ఏ సెక్షన్ వర్తిస్తుందని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించారు. అవినీతి నిరోధక చట్టం విషయంలో ఒక ప్రభుత్వం.. గత ప్రభుత్వ అధినేత పై కేసులు నమోదు చేయడం.. దానిపై సుదీర్ఘ వాదనలు జరగడంతో తీర్పుపై దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పక్షాల నేతలు ఎదురుచూస్తున్నారు.