
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. ప్రమాణ స్వీకారం చేసి 59 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఆయన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తన అధికారిక నివాసం వైట్ హౌస్ లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తన తొలి వందరోజుల పరిపాలన పూర్తయ్యేసరికి చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి వివరించారు. ఆ దిశగా అధికార యంత్రాంగం కృషి చేయాల్సి ఉంటుందని సూచించారు. ప్రత్యేకించి తొలివంద రోజుల పాలన ముగిసే సమయానికి 200 మిలియన్ల డోసుల కరోనా వ్యాక్సిన్ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు జో బైడెన్ చెప్పారు.
తాను కచ్చితంగా పోటీ చేస్తారా లేదా అన్న విషయంపై చర్చించడానికి ఇంకా చాలా సమయం ఉందని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నానని వివరించారు. ప్రస్తుతం బైడెన్ వయసు 78 సంవత్సరాలు.. 2024 ఎన్నికల నాటికి ఆయన వయసు సహకరిస్తుందా..? అనే అనుమానాలు లేకపోలేదు కాగా.. తన తొలివంద రోజుల పరిపాలన పూర్తయ్యే నాటికి దేశవ్యాప్తంగా 200 మిలియన్ల డోసుల మేర కరోనా వ్యాక్సిన్లు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బైడెన్ తెలిపారు.
వందరోజుల లోపల కరోనా వైరస్ ను నియంత్రించగలమంటూ.. ఇదివరకే తాను చెప్పిన మాటపై నమ్మకం ఉంచి ప్రజలు కోవిడ్ ప్రొటోకాల్ పాటిస్తున్నారని.. తెలిపారు. ఇప్పటికే వంద మిలియన్ల మేర కరోనా టీకాలు వేశామని, దీన్ని డబుల్ చేశామని అన్నారు. కష్టసాధ్యమే అయినప్పటికీ.. ఈ లక్ష్యాన్ని అందుకోగలమని బైడెన్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమెరికాలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. రోజూ సగటున రెండున్నర మిలియన్ల మేర వ్యాక్సినేషన్లు వేస్తున్నారు.
దీన్ని రెట్టిపు చేయాలని తాజాగా బైడెన్ ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేసిన కరోనా వైరస్ వ్యాక్సిన్ ను 200 మిలియన్ల డోసుల మేర కోనుగోలు చేయనుంది. అలాగే ఫైజర్, మోడేర్నా నుంచి 600 మిలియన్ల డోసుల మేర వ్యాక్సిన్ ను కొనుగోలు చేయడానికి అవసరమైన చర్యలు పూర్తి చేసింది. దశలవారీగా ఈ వ్యాక్సిన్ అందుతుంది. ప్రస్తుతం అమెరికాలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది.