AP BJP: ఏపీలో వచ్చే ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ సన్నద్ధమవుతోంది. ఎన్నికల టీంను రెడీ చేస్తోంది. ఇప్పటికే అనూహ్యంగా పురందేశ్వరిని రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించింది. రేపు రాష్ట్ర కార్యవర్గాన్ని ఆమె ప్రకటించనున్నారు. ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. హై కమాండ్ ఆమోదంతో సోమవారం కార్యవర్గాన్ని ప్రకటించనున్నారు.
ఏపీ బీజేపీ ఇన్చార్జిగా బండి సంజయ్ నియమితులు కానున్నట్లు సమాచారం. బిజెపి తెలంగాణ మాజీ అధ్యక్షుడైన బండి సంజయ్ ను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఎనిమిది మందిని జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నియమించగా.. దక్షిణాది నుంచి బండి సంజయ్ ఒకరే కావడం గమనార్హం. ఆయనను బిజెపి ఏపీ వ్యవహారాల ఇన్చార్జిగా నియమించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీ ఇన్చార్జ్ సునీల్ దేవధర్ ను జాతీయ కార్యవర్గం నుంచి తొలగించిన నేపథ్యంలో కొత్త నేత ఎంపిక అనివార్యంగా మారింది. ఫైర్ బ్రాండ్ గా పేరొందిన బండి సంజయ్ ఏపీ ఇన్చార్జిగా నియమితులయితే పార్టీకి ఊపు వస్తుందని హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం.
ఐదేళ్లపాటు బిజెపి ఏపీ వ్యవహారాల ఇన్చార్జిగా పనిచేసిన సునీల్ దేవధర్ను పార్టీ పక్కన పెట్టింది. మహారాష్ట్రకు చెందిన సునీల్ దేవధర్ బిజెపి జాతియ కార్యదర్శిగా ఉన్నారు. ఆరేళ్ల క్రితం అప్పటి అధ్యక్షుడు అమిత్ షా నియమించారు. 2018 జూలైలో ఏపీ ఇన్చార్జిగా నియమితులయ్యారు. ఆది నుంచి ఆయన వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం ఉంది. ఆశించిన స్థాయిలో ఏపీలో అధికార వైసీపీ పై పోరాడలేకపోతున్నారని హై కమాండ్ కు ఫిర్యాదులు అందాయి. అందుకే ఆయన్ను పదవి నుంచి తొలగించినట్లు సమాచారం. ఆ స్థానంలో బండి సంజయ్ రానున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే వచ్చే ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ అన్ని విధాలా సిద్ధమవుతోంది.